Pawan Kalyan on Acting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ సినిమాల్లో ఇంకెంత కాలం కొనసాగుతాడు? ఈ ప్రశ్నకు పవనే ఈ మధ్య తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. తనకు డబ్బు కావాలి కాబట్టే తాను ఇంకా సినిమాల్లో నటిస్తున్నానని, అలాగే కొనసాగుతాననీ చెప్పడం విశేషం.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గత ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పవన్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో పవన్ స్పందించాడు.
“నేను హెన్రీ డేవిడ్ తోనీ, యోగులు లేదా సిద్ధుల నుంచి స్ఫూర్తి పొందుతాను. నిస్వార్థంగా ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. నేను అదే ఆలోచనతో ఉంటాను. నేనెప్పుడూ సంపద పోగు చేసుకోలేదు. నేనెప్పుడూ ఏ వ్యాపారం మొదలుపెట్టలేదు. సినిమా నిర్మాణం సహా. నా సంపాదన అంతా సినిమాతోనే. నేను సినిమాలకు కట్టబడి ఉన్నాను కాబట్టి.. వాటిని పూర్తి చేయాల్సిందే” అని పవన్ అన్నాడు.
పార్ట్ టైమ్ యాక్టర్ లేదా పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలపైనా పవన్ తాజా ఇంటర్వ్యూల స్పందించాడు. ఎంతో మంది రాజకీయ నాయకులు అటు వ్యాపారాలు, ఇటు పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టిసారిస్తుంటారని ఈ సందర్భంగా పవన్ అన్నాడు.
“ఎంతో మంది నాయకులకు సొంత వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లు అవి చేస్తూనే రాజకీయాల్లోనూ రాణిస్తుంటే.. నేనూ అలా చేయగలను. పూర్తి అంకితభావంతో అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చేస్తే అది సాధ్యమే. 1990ల నుంచే నటిస్తున్న సమయంలో ప్రజా విధానాల గురించి చదువుతూ ఉండేవాడిని. నాకు డబ్బు అవసరం ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంటా. అదే సమయంలో నా రాజకీయ వ్యవహారాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని పవన్ స్పష్టం చేశాడు.
పవన్ కల్యాణ్ జనసేనను స్థాపించే ఎన్నో ఏళ్లు అవుతున్నా.. గతేడాది ఏపీ ఎన్నికల నుంచి చాలా బిజీగా మారాడు. అన్ని స్థానాల్లో విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ తన రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడు.
చివరిగా 2023లో వచ్చిన బ్రో మూవీలో నటించిన అతడు.. ఇప్పటి వరకూ మరో సినిమాలో కనిపించలేదు. హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ పూర్తవలేదని వెల్లడించాడు. దీనికితోడు సుజీత్ డైరెక్షన్ లో దే కాల్ హిమ్ ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు.
సంబంధిత కథనం