Pawan Kalyan on OG: ఫ్యాన్స్ అలా అంటే భయమేస్తోంది.. అన్ని సినిమాలూ పూర్తి చేస్తా.. ఓజీ స్టోరీ ఇదే..: పవన్ కామెంట్స్
Pawan Kalyan on OG: పవన్ కల్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లుతోపాటు తన నెక్ట్స్ సినిమాలపై స్పందించాడు. అన్ని మూవీస్ ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని అతడు స్పష్టం చేశాడు. మీడియాతో మాట్లాడిన అతడు.. అల్లు అర్జున్ ఇష్యూపై కూడా తొలిసారి స్పందించాడు.
Pawan Kalyan on OG: సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం (డిసెంబర్ 30) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అతడు స్పందించాడు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించడంతోపాటు తన రాబోయే సినిమా గురించి కూడా చెప్పాడు. ఓజీ, హరి హర వీరమల్లు మూవీస్ షూటింగ్ లపై వివరణ ఇచ్చాడు. సోమవారం (డిసెంబర్ 30) జనసేన పార్టీ ఆఫీస్ లో మీడియాతో చిట్‌చాట్ లో అతడు మాట్లాడాడు.
ఓజీ, ఇతర సినిమాలపై ఇలా..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన నెక్ట్స్ మూవీస్ ఓజీ, హరి హర వీరమల్లుపై స్పందించాడు. ఏపీ ఎన్నికలు, జనసేన విజయం, డిప్యూటీ సీఎం కావడం, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ నెక్ట్స్ సినిమాలపై సందిగ్ధత నెలకొంది. వీటిపై ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవనే తన తర్వాతి మూవీస్ పై కీలకమైన కామెంట్స్ చేశాడు.
ఎంతో ఆసక్తి రేపుతున్న ఓజీ మూవీ గురించి చెబుతూ.. ఈ ఓజీ 1980, 90ల్లో జరిగే కథ అని వెల్లడించాడు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అన్నాడు. తాను ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఓజీ, ఓజీ అని అరుస్తున్నారని, అవి తనకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయని పవన్ అనడం గమనార్హం.
అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను
ఇక తాను రాజకీయాల్లో ఎంత బిజీ అయినా అన్ని సినిమాలను తాను డేట్స్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా పవన్ చెప్పాడు. అయితే వాళ్లే సరిగా సద్వినియోగం చేసుకోలేదని అనడం విశేషం. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా 8 రోజులు పెండింగ్ లో ఉందని చెప్పాడు.
అన్ని సినిమాలను తాను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీ, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఉన్నాయి. వీటిపై అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్‌పై పవన్ కామెంట్స్
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపైనా పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించాడు. చిన్న విషయాన్ని అనవసర రాద్ధాంతం చేశారని అతడు అనడం గమనార్హం. బన్నీ సిబ్బంది ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. అల్లు అర్జునే కాదు ఆ స్థానంలో ఎవరున్నా.. సీఎం రేవంత్ రెడ్డి అలాగే స్పందించి ఉండేవారని కూడా పవన్ స్పష్టం చేశాడు.
ఇక అటు గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా పవన్ రాబోతున్నాడు. ఈ ఈవెంట్ జనవరి 4న రాజమండ్రిలో జరగనుంది. ఈవెంట్ కు రావాల్సిందిగా పవన్ ను మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కోరగా.. అతడు ఓకే చెప్పాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ పాల్గొననున్న తొలి మూవీ ఈవెంట్ ఇదే కానుంది. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.