Pawan Kalyan Khushi 2: పవన్ కల్యాణ్‌తో ఖుషీ 2.. కథ సార్ దగ్గరే ఉందన్న ఎస్‌జే సూర్య.. కానీ అంటూ ట్విస్ట్
Pawan Kalyan Khushi 2: పవన్ కల్యాణ్ ఖుషీ 2 మూవీ వస్తుందా? ఇప్పటికే కథ రెడీగా ఉందని, అది పవన్ దగ్గరే ఉందని డైరెక్టర్ ఎస్‌జే సూర్య చెప్పడం విశేషం. కానీ అంటూ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Khushi 2: పవన్ కల్యాణ్, భూమిక నటించిన ఖుషీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. 2001లో రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తున్న సమయంలో ఈ ఖుషీకి కూడా ఓ సీక్వెల్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై తాజాగా సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ ఎస్‌జే సూర్య స్పందించాడు.
ఖుషీ 2 స్క్రిప్ట్ రెడీ
సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరో నాని, హీరోయిన్ ప్రియాంకా మోహన్, ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఎస్‌జే సూర్య సరదాగా మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా ప్రియాంకా మోహన్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్‌తో ఖుషీ 2 చేసే ఆలోచన ఉందా అని సూర్యను అడిగింది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధం చేశానని, పవన్ కల్యాణే వద్దన్నాడని అతడు చెప్పడం గమనార్హం.
పవన్ వద్దన్నాడా?
ఖుషీ 2 ఎప్పుడు చేస్తున్నారు? ఇందులో పవన్ సర్ ఉంటారా లేక వేరే హీరో ఉంటారా అని ప్రియాంకా అడిగింది. దీనికి సూర్య స్పందిస్తూ.. "ఖుషీ 2 స్టోరీ ఇప్పటికే పవన్ గారి దగ్గర ఉంది. చాలా రోజుల కిందట ఈ స్టోరీ నేను చెప్పాను. నేను, ఆయన ఆ స్టోరీ చాలా ఎంజాయ్ చేశాం. ఖుషీ 2 అని కాకుండా మరో టైటిల్ తో ఆ స్టోరీ సిద్ధం చేశాను.
స్టోరీ బాగున్నా.. ఈ సమయంలో లవ్ స్టోరీలు చేయడం బాగుండదు అని పవన్ సర్ అన్నారు. అదేంటి సర్ అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ సీనియర్ హీరోలు అయిన తర్వాత కూడా లవ్ స్టోరీలు చేశారని చెప్పాను. అయినా పవన్ వద్దన్నారు. అది మాత్రం వచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ నాకు ఆ బాధ ఉంది" అని సూర్య చెప్పాడు.
నాని, రామ్ చరణ్ సూటవుతారు
మరి ఖుషీ 2 ఒకవేళ చేయాలని అనుకుంటే ఏ హీరోతో చేస్తారు అని ప్రియాంకా మరోసారి అడిగింది. దీనికి సూర్య స్పందిస్తూ.. "ఇప్పటికీ ఆశ ఉంది. ఈ సినిమా చేస్తే నాని చేయొచ్చు. రామ్ చరణ్ లేదా విజయ్ కూడా చేయొచ్చు. ఈ ముగ్గురికీ ఈ కథ సూటవుతుంది" అని అన్నాడు.
మరి హీరోయిన్ ఎవరు అని ప్రియాంకా గడుసుగా అడిగితే.. అదన్నమాట అసలు సంగతి అని పక్కనే ఉన్న నాని నవ్వుతూ అన్నాడు. అయితే ఈ కథ కచ్చితంగా ప్రియాంకాకు సూటవుతుంది అని సూర్య అనడంతో ఆమె నవ్వేసింది.
మొత్తానికి ఖుషీ 2 చేయాలన్న ఆలోచన సూర్యకు ఉన్నా.. పవన్ కల్యాణ్ అందుకు సిద్ధంగా లేకపోవడం మాత్రం అతని అభిమానులకు నిరాశ కలిగించేదే. 2001లో పవన్, భూమిక జంటగా నటించిన ఖుషీ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ రీరిలీజ్ లోనూ మంచి వసూళ్లే సాధించింది.