పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ నటుడు అభిమన్యు సింగ్ తెలుగులో చాలా పాపులర్ అయ్యారు. ఆ మూవీలో సిద్దప్ప నాయుడు అనే మెయిన్ విలన్ రోల్‍లో అభిమన్యు మెప్పించారు. దీంతో ఆ క్యారెక్టర్ ఇప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోయింది. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హీరోగా చేస్తున్న ‘ఓజీ’ చిత్రంలో అభిమన్యు నటిస్తున్నారు. సుమారు 13ఏళ్ల తర్వాత పవన్‍తో మళ్లీ కలిసి నటిస్తున్న అనుభవాలను అభిమన్యు వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను చెప్పారు.
2010లో రక్తచరిత్ర మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అభిమన్యు సింగ్ అడుగుపెట్టారు. గబ్బర్ సింగ్ చిత్రంతో తెలుగులో ఫేమస్ అయ్యారు. మరిన్ని చిత్రాలు చేశారు. పవన్ కల్యాణ్ గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు అభిమన్యు. వ్యక్తిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అప్పుడు.. ఇప్పుడు ఒకేలా ఉన్నారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యారని చెప్పారు.
సినిమాలు, రాజకీయాల మధ్య బాలెన్స్ చేసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని అభిమన్యు సింగ్ చెప్పారు. “ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్‍ను మళ్లీ కలవడం చాలా సంతోషంగా అనిపించింది. రాజకీయాల్లో బిజీ అవడం తప్పించి వ్యక్తిగా ఆయనలో నేను ఎలాంటి మార్పు చూడలేదు. సినిమాలు, రాజకీయాల మధ్య సరైన బ్యాలెన్స్ ఉండేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో నా రోల్ గురించి రివీల్ చేయలేను. కొత్తగా అయితే ఉంటుంది. ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేసేందుకు ఎదురుచూస్తున్నా” అని అభిమన్యు సింగ్ చెప్పారు.
అభిమన్యు సింగ్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఎల్2:ఎంపురాన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. లూసిఫర్ మూవీకి సీక్వెల్‍గా ఇది రూపొందింది. ఎంపూరన్ చిత్రానికి షూటింగ్ చేస్తుంటే.. ఇది హాలీవుడ్ చిత్రంలా అనిపించిందని అభిమన్యు తెలిపారు. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన చిత్రం అది అని వెల్లడించారు.
మోహన్ లాల్, పృథ్విరాజ్‍తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని అభిమన్యు సింగ్ అన్నారు. “నేను లూసిఫర్ చిత్రం చూశాను. పృథ్విరాజ్ సుకుమార్ చాలా టాలెండెట్ యాక్టర్, డైరెక్టర్. అతడికి ఏం కావాలో మనకు బాగా తెలుస్తుంది. అందుకే అతడితో పని చేయడం చాలా సులువు. మోహన్‍లాల్‍తో నటించడం కూడా అద్భుతమైన అనుభవం” అని అభిమన్యు సింగ్ అన్నారు. ప్రస్తుతం లాహోర్ 1947 అనే బాలీవుడ్ చిత్రంలోనూ అభిమన్యు నటిస్తున్నారు.
సంబంధిత కథనం