పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ఆలస్యం.. ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నిర్మాతల ప్రకటన.. చరిత్ర సృష్టించడానికి సిద్ధమంటూ!-pawan kalyan hari hara veeramallu postponed producers official announcement on trailer and new release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ఆలస్యం.. ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నిర్మాతల ప్రకటన.. చరిత్ర సృష్టించడానికి సిద్ధమంటూ!

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ఆలస్యం.. ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నిర్మాతల ప్రకటన.. చరిత్ర సృష్టించడానికి సిద్ధమంటూ!

Sanjiv Kumar HT Telugu

పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు రిలీజ్ డేట్‌పై ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా హరి హర వీరమల్లు ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. జూన్ 12న హరి హర వీరమల్లు విడుదల కావడం లేదని, ఆలస్యం కానుందని, ఓర్పుతో ఉండమని నిర్మాతలు కోరారు.

పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు ఆలస్యం.. ట్రైలర్, రిలీజ్ డేట్‌పై నిర్మాతల ప్రకటన.. చరిత్ర సృష్టించడానికి సిద్ధమంటూ!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అవిశ్రాంత ప్రయత్నాలు

"అచంచలమైన ఓపిక మరియు నమ్మకంతో హరి హర వీరమల్లు సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని తెలియజేస్తున్నాము" అని నిర్మాతలు తెలిపారు.

"కష్టమైనయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మరింత గొప్పగా మలచాలనేదే మా ప్రయత్నం. ప్రతి ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాము. అందుకే మేము మరి కొంత సమయం తీసుకుంటున్నాము. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాము" అని మేకర్స్ చెప్పారు.

తోచినది రాస్తున్నారు

"మరోవైపు సామాజిక మాధ్యమాల్లో హరి హర వీరమల్లు చిత్రం గురించి తప్పుడు వార్తలు ప్రచారమవ్వడం మేము గమనించాము. చాలామంది తమకు తోచినది రాసేస్తున్నారు. ధృవీకరించని వార్తలను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేయవద్దని మేము ప్రతి ఒక్కరినీ కోరుతున్నాము. దయచేసి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారా మాత్రమే సినిమాకి సంబంధించిన అప్డేట్ల కోసం వేచి ఉండండి. అప్పటి వరకు, ఎటువంటి ప్రచారాలను నిజమని భావించకండి" అని రిక్వెస్ట్ చేశారు.

"హరి హర వీరమల్లు చిత్రం ఒక అద్భుతమైన ప్రయాణం. వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి 24 గంటలూ తమ శక్తికి మించి కృషి చేస్తున్నారు. ఈ ఆలస్యం మన సహనాన్ని పరీక్షించవచ్చు. కానీ, అంతకంటే గొప్పది ఏదో రూపుదిద్దుకుంటుందని కూడా ఇది సూచిస్తుంది" అని నిర్మాతలు అన్నారు.

ప్రతిధ్వనించేలా

"ప్రతి దృశ్యం ఆశ్చర్యపరిచేలా, ప్రతి శబ్దం ప్రతిధ్వనించేలా, ప్రతి సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం నిర్మాణాంతర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. హరి హర వీరమల్లు భారీ, శక్తివంతమైన థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ట్రైలర్‌తో పాటు, కొత్త విడుదల తేదీని కూడా తెలియజేస్తాము. కాబట్టి భారీ ప్రకటన కోసం వేచి ఉండండి" అని గుడ్ న్యూస్ చెప్పారు.

"హరి హర వీరమల్లు సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అద్భుతమైన ట్రైలర్‌ను మీతో పంచుకోవడానికి మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. అద్భుతాన్ని చూడటానికి, చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ మేకర్స్ రాసుకొచ్చారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం