Hari Hara Veera Mallu New Release Date Announced: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ అభిమానలు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది.
తాజాగా మరోసారి హరి హర వీరమల్లు వాయిదా పడింది. ఇంతకుముందు మార్చి 28న హరి హర వీరమల్లు రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా మేలో హరి హర వీరమల్లు విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో మే 9న హరి హర వీరమల్లు మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గుర్రంపై సవారీ చేస్తున్న పవన్ కల్యాణ్ చాలా ఫ్యూరియస్‌గా కనిపించాడు. పవన్ కల్యాణ్ వెనుక గుర్రాలపై హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర నటులు నాజర్, సుబ్బరాజు, కబీర్ సింగ్, సునీల్ ఉన్నారు.
అలాగే, హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. "ధర్మం, న్యాయం కోసం పోరాడే యుద్ధం సిద్ధమైంది. దీన్ని ఎవరు ఆపలేరు. అత్యంత వేగంతో ఈ యుద్ధానికి హరి హర వీరమల్లు నాయకత్వం వహించనున్నాడు. ఈసారి అతని వేట ముందు ఏది పనికిరాదు" అంటూ నోట్ రాసుకొచ్చారు.
అయితే, హోలీ, జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇవాళ (మార్చి 14) హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. దీంతో నితిన్ రాబిన్‌హుడ్ సినిమాకు, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న మ్యాడ్ స్క్వేర్ రెండు సినిమాలకు లైన్ క్లియర్ అయింది. పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ మార్చి 28న రిలీజ్ కానుంది.
ఇక మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వస్తోన్న మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మార్చి 28నే థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, మ్యాడ్ స్క్వేర్ విడుదల తేదిని ప్రకటించిన సమయంలో "పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కూడా అదే డేట్‌కు రిలీజ్ అవుతుంది కదా" అని నిర్మాత నాగవంశీని మీడియా ప్రశ్నించింది.
దానికి "పవన్ కల్యాణ్ గారి సినిమా వస్తే మా మూవీ వాయిదా వేస్తాం" అని నాగవంశీ సమాధానం ఇచ్చారు. కానీ, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా హరి హర వీరమల్లు మూవీనే మే నెలలో 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీని ఏఎం రత్నం సమర్పణలో నిర్మించారు.
సంబంధిత కథనం
టాపిక్