Hari Hara Veera Mallu: పవర్ స్టార్ అభిమానులకు న్యూఇయర్ సర్‌ప్రైజ్.. హరి హర వీరమల్లు నుంచి అదిరిపోయే అప్‍డేట్
Hari Hara Veera Mallu Maata Vinali Song: హరి హర వీరమల్లు సినిమా తొలి పాట రిలీజ్‍కు ముహూర్తం ఖరారైంది. పవన్ కల్యాణ్ స్వయంగా ఈ పాట పాడారు. న్యూఇయర్ సందర్భంగా ఈ అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎందగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్‍డేట్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు 2025 సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా నేడు జనవరి 1న మూవీ టీమ్ అదిరిపోయే విషయం చెప్పింది. తొలి పాట రిలీజ్ డేట్, టైమ్ వెల్లడించింది. ఈ పాటను స్వయంగా పవన్ కల్యాణ్ పాడారు. కొత్త పోస్టర్‌తో పాటు తొలి పాట వివరాలను మేకర్స్ ప్రకటించారు.
పాట రిలీజ్ డేట్, టైమ్
హరి హర వీరమల్లు నుంచి ‘మాట వినాలి’ అంటూ తొలి సాంగ్ రానుంది. ఈ పాట జనవరి 6వ తేదీన ఉదయం 9 గంటల 6 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటించింది. “2025 పవర్ ప్యాక్డ్‌గా ఉండనుంది. హరి హర వీరమల్లు నుంచి తొలి పాటతో కొత్త సంవత్సరాన్ని సెలెబ్రేట్ చేసుకోండి. ఫస్ట్ సాంగ్ జనవరి 6వ తేదీ ఉదయం 9:06 గంటలకు వస్తుంది” అని మెగా సూర్య ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది.
పవన్ గాత్రం
హరి హర వీరమల్లులో మాట వినాలి అనే ఈ పాటను పవన్ కల్యాణ్ స్వయంగా పాడారు. దీంతో ఈ సాంగ్‍పై మరింత హైప్ ఉంది. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
హరి హర వీరమల్లు నుంచి తొలి పాట గతేడాది దీపావళికే వస్తుందని రూమర్లు వచ్చాయి. అప్పటికే పాట కూడా సిద్ధమైనట్టు టాక్. కానీ మేకర్స్ మాత్రం పాటను వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు కొత్త సంవత్సరంలో అదిరిపోయే అప్‍డేట్ ఇచ్చారు. జనవరి 6న వచ్చే ఈ పాట కోస పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
నయా పోస్టర్.. రిలీజ్ డేట్ ఇదే
పాట అప్‍డేట్‍తో పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్ కూడా వచ్చేసింది. యోధుడి గెటప్‍లో చలి మంట ముందు అలా స్టైలిష్‍గా కూర్చొని పవన్ నవ్వుతూ ఉన్నారు. ఈ పోస్టర్ అట్రాక్టివ్‍గా ఉంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 28వ తేదీన విడుదల అవుతుందని ఈ పోస్టర్‌లో మరోసారి కన్ఫర్మ్ చేసింది మూవీ టీమ్.
హరి హర వీరమల్లు సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు. ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకుడిగా ఉన్నారు. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం ఇంకా 8 రోజుల షూటింగే పెండింగ్‍లో ఉందని పవన్ ఇటీవల చెప్పారు. హరి హర వీరమల్లు మూవీలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‍జీత్ విర్క్, నోరా ఫతేహి కీలకపాత్రలు పోషిస్తున్నారు.
పవన్ కల్యాణ్ లైనప్‍లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. క్రమంగా సినిమాలను పూర్తి చేస్తానని పవన్ ఇటీవల చెప్పారు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీపై చాలా హైప్ ఉంది.
సంబంధిత కథనం