యానిమల్ చూసి బాబీ డియోల్ పాత్రను మార్చేశాను.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. మరింత శక్తివంతంగా సీన్లు!-pawan kalyan hari hara veera mallu director jyothi krishna rewrote bobby deol role after watching his acting in animal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  యానిమల్ చూసి బాబీ డియోల్ పాత్రను మార్చేశాను.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. మరింత శక్తివంతంగా సీన్లు!

యానిమల్ చూసి బాబీ డియోల్ పాత్రను మార్చేశాను.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. మరింత శక్తివంతంగా సీన్లు!

Sanjiv Kumar HT Telugu

పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ నటుడు బాబీ డియోల్ యాక్ట్ చేస్తున్నాడు. అయితే, హరి హర వీరమల్లులో బాబీ డియోల్ పాత్రను యానిమల్ చూసిన తర్వాత మార్చేసినట్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. మరింత శక్తివంతంగా క్రియేట్ చేస్తున్నట్లు చెప్పారు.

యానిమల్ చూసి బాబీ డియోల్ పాత్రను మార్చేశాను.. హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. మరింత శక్తివంతంగా సీన్లు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.

హరి హర వీరమల్లు ట్రైలర్

జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన హరి హర వీరమల్లు గ్లింప్స్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. జూలై 3న హరి హర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కల్యాణ్‌కు పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ హరి హర వీరమల్లులో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు.

బాబీ డియోల్ నటన చూసి

నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, 'యానిమల్‌'లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.

"యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్త పరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు.

శక్తివంతంగా కనిపిస్తారు

"నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం" అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.

ఈ క్రమంలో బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు డైరెక్టర్ జ్యోతి కృష్ణ. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, శక్తివంతమైన సీన్లతో ఆకర్షణీయంగా మారింది.

నేపథ్య కథ, ఆహార్యంలో మార్పులు

యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ చూశారు. ఆ స్టార్‌డమ్‌‌కి న్యాయం చేయడానికి, ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం