పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిపిందే. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి మూవీలో తన డబ్బింగ్ పార్ట్ ను పవన్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం.
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తన తొలి మూవీ హరి హర వీరమల్లు. అతనికిదే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా. అలాంటి సినిమా డబ్బింగ్ ను పవన్ కేవలం నాలుగే గంటల్లో ముగించాడంటే ఆశ్చర్యం కలగకమానదు. గురువారం (మే 29) ఆ మూవీ టీమ్ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అది కూడా అర్ధరాత్రి వేళ కావడం మరో విశేషం.
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అసలు అంతులేని ఏకాగ్రత, ఫైర్ తో హరి హర వీరమల్లు డబ్బింగ్ పూర్తి చేశాడు. బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా.. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 10 గంటలకు ఆయన డబ్బింగ్ మొదలుపెట్టారు. మొత్తం డబ్బింగ్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశారు. పవర్ తుఫాను కోసం సిద్ధంగా ఉండండి. అడ్రినలైన్ ను ఉరకలెత్తించే రైడ్ జూన్ 12న మీకోసం చూస్తుంటుంది” అనే క్యాప్షన్ తో హరి హర వీరమల్లు టీమ్ ట్వీట్ చేసింది.
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత బిజీ అయ్యాడు. అదే సమయంలో ఓజీ మూవీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ హరి హర వీరమల్లు డబ్బింగ్ లో పాల్గొని కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశాడంటే అతని అంకిత భావం అలాంటిదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి అర్ధరాత్రి దాటే వరకూ డబ్బింగ్ పనుల్లో నిమగ్నమవడం గమనార్హం.
ఈ హరి హర వీరమల్లు షూటింగ్ ను 200 రోజుల్లో పూర్తి చేశారు. ఈ చారిత్రక మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. క్రిష్, జ్యోతికృష్ణ మూవీని డైరెక్ట్ చేయగా.. కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇది 17వ శతాబ్దంలో జరిగిన స్టోరీ. రెబల్ వీరమల్లు పాత్రలో పవన్ నటించాడు. మొఘల్స్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి సంపాదించే పనిలో అతడు ఉంటాడు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు పాత్రలో నటించాడు.
సంబంధిత కథనం