Pawan Kalyan Vote: హెలికాప్టర్‌లో వచ్చి ఓటేసిన పవన్ కల్యాణ్ దంపతులు.. ఫొటోలు, వీడియోలు వైరల్
Pawan Kalyan Vote: పవన్ కల్యాణ్ తన భార్య ఎనా లెజ్నోవాతో కలిసి వచ్చి ఓటేశాడు. ఈ దంపతులు ఓటు వేయడానికి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో మంగళగిరిలో ల్యాండవడం విశేషం.
Pawan Kalyan Vote: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తన భార్య ఎనా లెజ్నోవాతో కలిసి ఓటు వేశాడు. సోమవారం (మే 13) అతడు ప్రత్యేక హెలికాప్టర్ లో మంగళగిరి రావడం విశేషం. ఏపీలో అసెంబ్లీ, లోక్‌కభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు.
ఓటేసిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, భార్య ఎనా లెజ్నోవా సోమవారం (మే 13) ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్ లో మంగళగిరి చేరుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి వెళ్లి ఓటు వేశారు. పోలింగ్ స్టేషన్ లో వీళ్లు ఓటు వేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓటు వేయడానికి వచ్చిన పవన్ ను చూడటానికి అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
పోలింగ్ స్టేషన్ లో మొదట పవన్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటు వేసి, తర్వాత పక్కనే పార్లమెంట్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఈవీఎం మెషీన్ లో ఓటు వేశాడు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత తన వేలిపై ఉన్న సిరా గుర్తును పవన్ చూపించాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కొందరు అభిమానులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడం గమనార్హం.
ఏపీలో కూటమి తరఫున..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున పిఠాపురం ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ మూడు పార్టీలు కలిసి అక్కడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లోనూ పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసినా.. రెండింట్లోనూ ఓడిపోయాడు.
ఆ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి అతడు పోటీ చేశాడు. అయితే గాజువాకలో 16 వేల ఓట్లతో, భీమవరంలో 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఈ రెండు స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు.
ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కు మొత్తం మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్లు నేరుగా వెళ్లి ప్రచారం నిర్వహించారు. రామ్ చరణ్ కూడా వెళ్లి తన బాబాయ్ ను కలిశాడు. చిరంజీవి కూడా ఓ వీడియో సందేశం ద్వారా పవన్ ను గెలిపించాలని పిఠాపురం ఓటర్లను కోరినా.. నేరుగా వెళ్లి ప్రచారం చేయలేదు.
అయితే ఇదే సమయంలో అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నిల్చొన్న రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై బన్నీ వివరణ కూడా ఇచ్చాడు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, తనవాళ్లు ఏ పార్టీలో ఉన్నా మద్దతిస్తానని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తాను పవన్ కల్యాణ్ కు కూడా సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపాడు.
టాపిక్