Pawan Kalyan Birthday: ఆంధ్రుల ఇంటి పెద్ద బిడ్డ.. నీలాంటి నాయకుడు కావాలి అంటూ పవన్‌కు చిరు బర్త్‌డే విషెస్.. చరణ్ కూడా..
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ కు చిరంజీవి, రామ్ చరణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. నీ లాంటి నాయకుడు కావాలి, రావాలి అంటూ ఎక్స్ అకౌంట్ ద్వారా చిరు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ తనలో ఎంతో స్ఫూర్తి నింపాడని చరణ్ అన్నాడు.
Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా అతని అన్న మెగాస్టార్ చిరంజీవితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ బర్త్ డే జరుపుకుంటుండటంతో చిరు అతనికి ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు.
నీలాంటి నాయకుడే కావాలి
తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు తన ఎక్స్ అకౌంట్ ద్వారా చిరంజీవి సోమవారం (సెప్టెంబర్ 2) ఉదయం బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా నీలాంటి నాయకుడే కావాలి, రావాలి అంటూ చిరు అన్నాడు. నువ్వు మాత్రమే అద్భుతాలు చేయగలవని కూడా ఈ సందర్భంగా చిరంజీవి అభిప్రాయపడ్డాడు.
"కళ్యాణ్ బాబు.. ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అని ట్వీట్ చేశాడు.
మీ నుంచే స్ఫూర్తి పొందాను: చరణ్
అటు రామ్ చరణ్ కూడా పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. "పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి హ్యాపీయెస్ట్ బర్త్ డే. మీ బలం, అంకితభావం, ఆపదలో ఉన్న వారి పట్ల మీరు చూపించే కరుణ ఎప్పుడూ నాలో, నాలాంటి వారి మరెందరిలోనో స్ఫూర్తి నింపింది.
మీ నిస్వార్థమైన సేవలు, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం, ప్రజల కోసం అంకితభావంతో మీరు చేసే పని.. ఆంధ్రప్రదేశ్ లోని అణగారిన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎంతో స్ఫూర్తి నింపుతోంది. ఆ దేవుడు మీకు మరింత బలాన్నివ్వాలని కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
డిప్యూటీ సీఎం హోదాలో..
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తొలిసారి తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అయితే ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అభిమానులు భావించినా ఏపీ, తెలంగాణల్లో వానలు, వరదలతో వాటికి దూరమయ్యారు.
పవన్ నెక్ట్స్ మూవీస్ ఓజీ, హరి హర వీర మల్లు నుంచి రావాల్సిన అప్డేట్స్ ను కూడా మేకర్స్ వాయిదా వేశారు. వీటిని రానున్న రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఓటీ నుంచి టీజర్, హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ పోస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినా ఒక రోజు ముందే ఆ ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.