Pawan Kalyan Thalapathy Vijay: ఏది ఏమైనా ఆ పని మాత్రం చేయకు: రాజకీయాల్లోకి వస్తున్న విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన-pawan kalyan advises thalapathy vijay on political journey just stay around irrespective of what happens ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Thalapathy Vijay: ఏది ఏమైనా ఆ పని మాత్రం చేయకు: రాజకీయాల్లోకి వస్తున్న విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన

Pawan Kalyan Thalapathy Vijay: ఏది ఏమైనా ఆ పని మాత్రం చేయకు: రాజకీయాల్లోకి వస్తున్న విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన

Hari Prasad S HT Telugu

Pawan Kalyan Thalapathy Vijay: సినిమాలు వదిలి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తున్న తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి ఓ కీలకమైన సూచన చేశాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఏది ఏమైనా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశాడు.

ఏది ఏమైనా ఆ పని మాత్రం చేయకు: రాజకీయాల్లోకి వస్తున్న విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన

Pawan Kalyan Thalapathy Vijay: టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఈ అనుభవం అతనికి గత ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడింది. ఇప్పుడదే అనుభంతో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఓ సలహా ఇస్తున్నాడు. విజయ్ తన చివరి మూవీ జన నాయగన్ తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.

జనంలోనే ఉండు: పవన్

దళపతి విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో పాల్గొనడానికి అతడు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. అతనికి ఓ సలహా ఇచ్చాడు. ఏది ఏమైనా జనాన్ని వదిలి వెళ్లకు అని స్పష్టం చేశాడు.

“అతనికి నా సూచనలు అవసరం లేదు. అతడు చాలా అనుభవజ్ఞుడు. తనకు సొంత ప్రయాణం ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం చెబుతాను. జనంలోనే ఉండు. ఏం జరిగినా సరే రాజకీయాల్లోనూ ఉండు. అంతే. అలజడులను తట్టుకో. రాజకీయాలు చాలా కఠినమైనవి. దానికోసం సిద్ధంగా ఉండాలి. గెలుపు సంగతి తర్వాత.. ముందు పార్టీని స్థిరంగా ఉంచడం ముఖ్యం” అని పవన్ అన్నాడు.

తిడతారు.. అందరికీ శత్రువులమవుతాం

ఇక రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా ఈ సందర్భంగా పవన్ చెప్పుకొచ్చాడు. దీనికోసం ఎన్నో త్యాగాలు తప్పవని అన్నాడు. “వ్యక్తిగత జీవితం ఉండదు. మిమ్మల్ని తిడతారు. అందరికీ శత్రువులుగా మారతాం. ఏ ప్రకటన ఇచ్చినా దానిని తప్పుగా స్వీకరిస్తారు. ప్రతి హీరోకి ఉన్నట్లే ప్రతి నాయకుడికి తనదైన స్టైల్ ఉంటుంది. నాకు నా స్టైల్ వర్కౌట్ అయినంత మాత్రాన అందరికీ అలాగే జరుగుతుందని అనుకోలేం” అని పవన్ అన్నాడు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తన సినిమా కెరీర్ పైనా స్పందించిన విషయం తెలిసిందే. తనకు డబ్బు అవసరం అయినంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం అతడు హరి హర వీరమల్లు, దే కాల్ హిమ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేస్తున్నాడు.

మరోవైపు విజయ్ మాత్రం రాజకీయాల్లోకి వెళ్లే ముందు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానున్న జన నాయగన్ అతని కెరీర్లో చివరి సినిమా కానుంది. దీని తర్వాత అతడు పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించి.. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం