Pathaan Movie Review: ప‌ఠాన్ మూవీ రివ్యూ - షారుఖ్‌ఖాన్ రీఎంట్రీ సినిమా ఎలా ఉందంటే-pathaan movie telugu review shahrukh khan spy thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pathaan Movie Telugu Review Shahrukh Khan Spy Thriller Movie Review

Pathaan Movie Review: ప‌ఠాన్ మూవీ రివ్యూ - షారుఖ్‌ఖాన్ రీఎంట్రీ సినిమా ఎలా ఉందంటే

HT Telugu Desk HT Telugu
Jan 25, 2023 03:50 PM IST

Pathaan Movie Review: షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ప‌ఠాన్ సినిమా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ బాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే...

షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్
షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్

Pathaan Movie Review: ప‌ఠాన్‌తో దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్‌(Shahrukh Khan). స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హిందీలో హిట్ పెయిర్‌గా పేరొందిన షారుఖ్‌ఖాన్‌, దీపికా ప‌డుకోణ్(Deepika Padukone) లాంగ్ గ్యాప్ త‌ర్వాత జంట‌గా న‌టించిన సినిమా ఇది. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా న‌టించిన ప‌ఠాన్‌ బుధ‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రీఎంట్రీతో షారుఖ్ అభిమానుల‌ను మెప్పించాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

Pathaan Movie Story - రా ఏజెంట్ ప‌ఠాన్‌…

ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దుచేసిన భార‌త‌దేశంపై దాడికి పాకిస్థాన్ భారీ ప్లాన్ చేస్తుంది. ఈ కుట్ర‌ను అమ‌లు చేసే బాధ్య‌త‌ను ప్రైవేట్ ఏజెంట్‌ జిమ్ (జాన్ అబ్ర‌హం) చేప‌డ‌తాడు. జిమ్ ప‌న్నాగాల్ని ఎదుర్కొనేందుకు ఇండియ‌న్ రా ఏజెంట్ ప‌ఠాన్ (షారుఖ్‌ఖాన్‌)రంగంలోకి దిగుతాడు.

చాలా ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నపఠాన్ ఈ ఆప‌రేష‌న్ కోసం ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చాడు? అత‌డు అజ్ఞాతంలోకి వెళ్ల‌డానికి కార‌ణం ఏమిటి? పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ రూబై (దీపికా ప‌డుకోణ్‌)తో ప‌ఠాన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? దేశం కోసం ప‌ఠాన్ చేసిన పోరాటానికి ఆమె సాయ‌ప‌డిందా లేదా అన్న‌దే ప‌ఠాన్ సినిమా క‌థ‌.

స్పై థ్రిల్ల‌ర్‌...

ప్ర‌స్తుతం గూఢ‌చార్య నేప‌థ్య క‌థాంశాల ట్రెండ్ కొన‌సాగుతోంది. ఈ జోన‌ర్‌లో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుండ‌టంతో వీటిలో న‌టించ‌డానికి స్టార్ హీరోలు ఆస‌క్తిని చూపుతున్నారు. దేశ‌భ‌క్తితో పాటు అభిమానుల‌ను మెప్పించే యాక్ష‌న్ సీక్వెన్స్ హీరోయిజం క‌ల‌బోత‌గా స్పై థ్రిల్ల‌ర్ సినిమాలు ఉంటాయి.

రీఎంట్రీ కోసం బాలీవుడ్ అగ్ర న‌టుడు షారుఖ్‌ఖాన్ స్పై థ్రిల్ల‌ర్ క‌థ‌ను ఎంచుకోవ‌డానికి అదొక కార‌ణ‌మై ఉంటుంది. దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత షారుఖ్‌ఖాన్ న‌టించిన సినిమా ఇది. అత‌డిని అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నారో ఆ హంగుల‌న్నీ ఉండేలా ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ప‌ఠాన్ సినిమాను (Pathaan Movie Review)తెర‌కెక్కించారు.

విజువ‌ల్ ఫీస్ట్‌...

క‌థ కంటే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్‌ ఫీస్ట్‌ను అందించ‌డానికి ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపించిన‌ట్లుగా క‌న‌పించింది. ఇండియాపై దాడికి జిమ్ రంగంలోకి దిగ‌డం, అత‌డిని ప‌ఠాన్ ఎదుర్కొనే సీన్‌ల‌తో ఫ‌స్ట్ హాఫ్ మొత్తం యాక్ష‌న్ సీన్స్‌తో నిండిపోయింది.

ఇండియా ఏజెంట్ అయిన జిమ్ శ‌త్రుదేశం కోసం ఎందుకు ప‌నిచేస్తున్నాడ‌నే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ యావ‌రేజ్‌గా ఉంది. దీపికా ప‌డుకోణ్ గ‌తం కూడా ఆస‌క్తిగా మ‌ల‌చ‌లేక‌పోయాడు డైరెక్ట‌ర్‌. చిన్న చిన్న లోపాల‌ను యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో క‌వ‌ర్ చేశాడు డైరెక్ట‌ర్‌. షారుఖ్‌ఖాన్ ఇంట్రాడ‌క్ష‌న్ యాక్ష‌న్ ఎపిసోడ్ తోనే(Pathaan Movie Review) ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో హింట్ ఇచ్చాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది.

గ‌త సినిమాల్ని గుర్తుకుతెస్తుంది...

య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌లో రూపొందిన ఏక్‌థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై సినిమాల‌ను చాలా చోట్ల ప‌ఠాన్ గుర్తుకుతెస్తుంది. క్లైమాక్స్‌ను రొటీన్‌గానే ముగించాడు డైరెక్ట‌ర్‌. షారుఖ్‌, దీపికా కెమిస్ట్రీ మాస్ ప్రేక్ష‌కుల్ని (Pathaan Movie Review)అల‌రించేలా తీర్చిదిద్దాడు.

షారుఖ్‌ ఫ్యాన్స్ పండ‌గే...

చాలా ఏళ్ల త‌ర్వాత షారుఖ్‌ఖాన్ చేసిన ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. రా ఏజెంట్ పాత్ర‌లో అత‌డి లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ఈ క్యారెక్ట‌ర్ కోసం ఫిజిక‌ల్‌గా మేకోవ‌ర్ అయిన విధానం మెప్పిస్తుంది.

దీపికా ప‌డుకోణ్ పాజిటివ్, నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. గ్లామ‌ర్ ప‌రంగా బేష‌రామ్ సాంగ్‌లో ఆక‌ట్టుకున్న‌ది. జాన్ అబ్ర‌హం స్టైలిష్‌గా క‌నిపించాడు. విల‌నిజం పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.ఈ ముగ్గురి త‌ర్వాత అశుతోష్‌రాణా, డింపుల్ క‌పాడియా క్యారెక్ట‌ర్స్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చిన‌ట్లుగా క‌నిపించింది.

అభిమానుల‌కు మాత్ర‌మే....

క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా చూసుకుంటే ప‌ఠాన్ కొత్త‌గా అనిపించ‌క‌పోవ‌చ్చు. కానీ షారుఖ్‌ఖాన్‌ను చాలా రోజుల త‌ర్వాత సిల్వ‌ర్‌స్క్రీన్‌పై చూడాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ మాత్రం ప‌ఠాన్ సినిమాను ఎంజాయ్ చేస్తారు.

IPL_Entry_Point