బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ చెల్లెలు అయిన పరిణీతి చోప్రా ప్రముఖ పొలిటిషియన్ రాఘవ్ చద్ధాను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ జంట ప్రముఖ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్‌కు హాజరై సందడి చేయనుంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి గెస్టులుగా వచ్చే రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో కామెడీతో ఆకట్టుకుంది. ఇందులో రాఘవ్ చద్దా చెప్పులు లేకుండా వస్తే.. "పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పులు లేకుండా షోకి వస్తానని మొక్కుకున్నారా ఏంటీ" అని హోస్ట్ కపిల్ దేవ్ పంచ్ వేశాడు.
"లేదు, బయట నా చెప్పులు ఎవరో దొంగలించారు" అని రాఘవ్ చద్దా చెప్పాడు. తర్వాత లేడి గెటప్పులో ఉండే కమెడియన్స్ వచ్చి "బావ గారు మీ చెప్పులు కావాలంటే డబ్బులు ఇచ్చుకోవాలి" అని అన్నారు. "ఒక నేత నుంచే మీరు డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారా" అని కౌంటర్ ఇచ్చాడు రాఘవ్ చద్దా.
అనంతరం రాఘవ్ చద్దాను మొదటిసారిగా లండన్‌లో కలిసినట్లు పరిణీతి చోప్రా చెప్పింది. ఆ తర్వాత వెంటనే రాఘవ్ చద్దా హైట్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు హీరోయిన్ తెలిపింది. దాంతో "నీకు నా హైట్ తెలియదా" అని లేచి నిలబడ్డాడు రాఘవ్. తర్వాత పరిణీతి చోప్రా ఏదైనా కోరుకుంటే దానికి రివర్స్‌లో జరుగుతుందని రాఘవ్ తెలిపాడు.
"తను ఏదైనా కోరుకుంటే దానికి రివర్స్‌లో జరుగుతుంది. తను (పరిణీతి చోప్రా) ఎప్పటికీ ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. కానీ, తీరా చూస్తే ఓ పొలిటిషియన్‌నే పెళ్లి చేసుకుంది. అందుకే రోజు ఉదయం నేను తనకు చెబుతాను. రాఘవ్ చద్దా అస్సలు ప్రధాన మంత్రి కాకూడదు, కాకూడదు అని కోరుకో" అని రాఘవ్ చద్దా చెప్పాడు.
దాంతో షోలో ఉన్నవాళ్లంతా నవ్వేశారు. అలా తను ప్రధాన మంత్రి కావాలన్నది రివర్స్ ప్లాన్‌లో చేస్తున్నట్లు కామెడీ చేశాడు రాఘవ్ చద్దా. దీనికి సంబంధించిన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఆదివారం (ఆగస్ట్ 3) స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే, 2023లో రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వైభవంగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం జరిగింది. ఈ వివాహానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
సంబంధిత కథనం