OTT Suspense Thriller Web Series: ఓటీటీలో సెంటిమెంట్‌తో కన్నీళ్లు పెట్టిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
Parachute Web Series: కుటుంబ నేపథ్యంతో వెబ్ సిరీస్ వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని ఓటీటీలో ఇప్పుడు పారాచూట్ తీర్చేస్తోంది. ఒక చిన్న బైక్ చుట్టూ కథని తిప్పిన దర్శకుడు రసు రంజిత్.. మనతో తెలియకుండానే కన్నీళ్లు పెట్టించేస్తాడు.
ఓటీటీలోకి ఈవారం వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో పారాచూట్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కిషోర్ సౌత్‌లో అందరికీ పరిచయమే. ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసే కిషోర్.. తొలిసారి ఒక తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. నవంబరు 29 నుంచి ఈ పారాచూట్ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏంటంటే?
ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు వేస్తూ షణ్ముగం(కిషోర్) తన ఫ్యామిలీని పోషిస్తుంటాడు. తన పరిస్థితి తన బిడ్డలకి రాకూడదని.. వారిని బాగా చదివించాలని కొడుకు వరుణ్ (శక్తి రిత్విక్), కూతురు రుద్ర (ఇయల్) విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. దాంతో షణ్ముగం అంటే ఆ ఇద్దరు పిల్లలు భయపడిపోతూ అమ్మ లక్ష్మీ (కని తిరు) బిడ్డలుగా ఉంటారు. అయితే.. ఒకరోజు తండ్రికి తెలియకుండా అతని మోటార్ సైకిల్‌పై చెల్లిని బర్త్ డే ట్రీట్ పేరు చెప్పి వరుణ్ బయటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత మళ్లీ ఆ పిల్లలు ఇంటికి రారు.. బైక్‌ను స్టేషన్‌కి ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? అక్కడ ఆ బైక్‌ను ఎవరు దొంగతనం చేస్తారు? పిల్లలు మళ్లీ ఆ బైక్ కోసం చేసే ప్రయత్నాలు ఏంటి? వీరికి ట్రాఫిక్ పోలీస్ ఎందుకు సాయం చేస్తాడు? పిల్లల పట్ల షణ్ముగం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించాడు? చివరికి పిల్లలు తల్లిదండ్రుల చెంతకి చేరుతారా? బైక్ దొరికిందా? ఇది తెలియాలంటే పారాచూట్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
కన్నీళ్లు పెట్టించే సీన్స్ ఎన్నో
దర్శకుడు రసు రంజిత్ తొలుత పిల్లల కోణం నుంచి కథని నడిపిస్తూ ఆ తర్వాత తల్లిదండ్రుల వైపునకి తిప్పి మనతో కన్నీళ్లు పెట్టిస్తాడు. బైక్‌ను ఇంటికి తీసుకెళ్లకపోతే తండ్రి కొడతాడనే భయం ఆ పిల్లల్లో కలిగినప్పుడు.. వాళ్లు పడే మానసిక సంఘర్షణ మనల్ని కలచివేస్తుంది. అలానే పిల్లలు కనిపించకుండా పోతే తల్లిదండ్రులు అనుభవించే మానసిక క్షోభను చూస్తే తెలియకుండానే మనకి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఓవరాల్‌గా పిల్లల్ని ఎలా ప్రేమతో పెంచాలి? అనేది ఈ పారాచూట‌్‌లో దర్శకుడు చక్కగా చూపించారు.
ఫ్యామిలీతో చూడదగిన సిరీస్
తండ్రిగా తొలుత కఠినంగా కనిపించే కిషోర్.. వారు కనిపించకుండా పోయిన తర్వాత పడే బాధ.. కన్నీళ్లు పెట్టుకునే తీరు అందర్నీ కలచివేస్తుంది. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్‌లో సీన్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. ఓవరాల్‌గా 3 గంటల సేపు ఫ్యామిలీతో కూర్చుని చక్కగా చూడగలిగే సినిమా పారాచ్యూట్.