Panchayat Season 2 Review | సరదాగా సాగిపోయే కామెడీ డ్రామా.. పంచాయత్‌ 2-panchayat season 2 a must watch comedy drama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Panchayat Season 2 Review | సరదాగా సాగిపోయే కామెడీ డ్రామా.. పంచాయత్‌ 2

Panchayat Season 2 Review | సరదాగా సాగిపోయే కామెడీ డ్రామా.. పంచాయత్‌ 2

Hari Prasad S HT Telugu
Jan 29, 2024 04:38 PM IST

Panchayat Season 2 Review: పంచాయత్ సీజన్ 2 ఒక ఊరి కథ. ఉన్నత చదువులు, ఎంఎన్‌సీలలో మంచి ఉద్యోగం చేయాలన్న కలలు కంటూ ఇష్టం లేకపోయినా ఆ ఊరిలోనే ఉంటూ, వాళ్లలో ఒకడిగా కలిసిపోయిన ఓ పంచాయతీ సెక్రటరీ కథ.

<p>పంచాయత్ 2</p>
<p>పంచాయత్ 2</p> (Twitter)

వెబ్‌సిరీస్‌: పంచాయత్‌ 2 (Panchayat 2)

డైరెక్టర్‌: దీపక్‌కుమార్ మిశ్రా

నటీనటులు : జితేంద్ర కుమార్‌, రఘుబీర్‌ యాదవ్‌, నీనా గుప్తా, ఫైసల్‌ మాలిక్‌, బిశ్వపతి సర్కార్‌, చందన్‌రాయ్, సాన్విక

ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

రెండేళ్ల కిందట పంచాయత్‌ పేరుతో వెబ్‌సిరీస్‌ వచ్చినప్పుడు దానిపై పెద్దగా అంచనాలు లేవు. అసలు వెబ్‌సిరీస్‌ అంటే పెద్ద పెద్ద యాక్షన్‌ సినిమాలను మించిన క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌లే అనుకున్న ప్రేక్షకులకు పల్లెటూరి స్వచ్ఛమైన గాలిని అందించింది ఈ పంచాయత్‌. ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే ఊరు. ఓ ఊళ్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఓ పంచాయతీ సెక్రటరీ.

ఆ గ్రామ ప్రధాన్‌ (సర్పంచ్‌), ఉప ప్రధాన్‌ (ఉప సర్పంచ్‌), ఆ గ్రామ సహాయకుడు, ప్రతిదానికీ అడ్డుపుల్ల వేసే ఊళ్లోని ఓ క్యారెక్టర్‌, ఆ ఊరి సమస్యలు, మూఢ నమ్మకాలు.. ఇలా భారతదేశంలోని ప్రతి పల్లె, ప్రతి మనిషి ఇదేదో మా కథలాగే ఉందే అని అనిపించేలా ఆ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది.

ఫ్యాన్స్‌కు ఓ డిఫరెంట్ ఫీల్‌ అందించిన ఈ పంచాయత్‌ వెబ్ సిరీస్ సూపర్‌ హిట్‌ టాక్‌ కొట్టేయడంతో సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అన్న ఆతృత అందరలోనూ కనిపించింది. మొత్తానికి ఈ నెల 18న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో పంచాయత్‌ 2 వచ్చేసింది. మరి ఈ సీక్వెల్‌ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? పంచాయత్‌ ఫస్ట్‌ పార్ట్‌ను మరిపించిందా?

పంచాయత్‌ 2లో ఏముంది?

ఇదొక కామెడీ డ్రామా. తొలి సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో సమస్యను తెరపైకి తెస్తూ.. దానికి సరదా పరిష్కారాలను చూపిస్తూ ఎంతో హాయిగా కథను ముందుకు నడిపించాడు దర్శకుడు. రెండో సీజన్‌ కూడా సరదాగానే సాగిపోయినా.. ప్రేక్షకులను నవ్విస్తూనే ఓ ఆత్మవిమర్శ చేసుకునేలా, ఆలోచింపజేసేలా, చివరికి కంటతడి పెట్టేలా కథను నడిపించారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్‌సిరీస్‌లలో ఇదో ఫీల్‌గుడ్‌ సిరీస్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నటీనటులను మెచ్చుకోకుండా ఉండలేం. ప్రతి ఒక్కరూ పాత్రలో జీవించేశారు. గ్రామ ప్రధాన్‌ మంజు దేవి పాత్రలో నీనా గుప్తా, ఆమె భర్త పాత్రలో రఘుబీర్‌యాదవ్‌, పంచాయత్ సెక్రటరీగా కనిపించే జితేంద్ర కుమార్‌ మంచి నటన కనబరిచారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వాళ్లే.

ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం కావడంతో నగరం వదిలి ఓ పల్లెకు పంచాయతీ సెక్రటరీగా వచ్చిన పాత్రలో అభిషేక్‌ త్రిపాఠీ (జితేంద్ర కుమార్‌) తొలి సీజన్‌లో కనిపిస్తాడు. ఎప్పుడెప్పుడు ఆ ఊరు వదిలివెళ్లి పోవాలా అని తన ఎంబీఏ చదువు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండో సీజన్‌లోనూ అతడు అదే ప్రయత్నంలో కనిపించినా.. ఆ గ్రామ ప్రధాన్‌ దంపతులు, ఆ ఊరి వాళ్లతో ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పర్చుకుంటాడు.

సింపుల్‌గా చెప్పాలంటే ఓ సిటీ యువకుడు.. అసలు తనకు అలవాటు లేని పల్లెటూరు వాతావరణానికి మెల్లగా ఎలా అడ్జెస్ట్ అవుతాడు? ఊళ్లల్లో ఉండే రాజకీయాలు, వాటి వల్ల అతడు పడే ఇబ్బందులు, అదే సమయంలో వాళ్లు తనపై చూపించే ప్రేమాభిమానాలు.. ఇలా మొత్తంగా గ్రామీణ భారతాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు ఈ వెబ్‌ సిరీస్‌ మేకర్లు.

అదే సమయంలో అహంకారపూరితమైన రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తారనే అంశాన్ని కూడా ఈ సీజన్‌లో చాలా చక్కగా చూపించారు. తొలి సీజన్‌లో చూపిన అంశాలు ఎక్కడా రిపీట్‌ కాకుండా చాలా జాగ్రత్తగా కథను ముందుకు తీసుకెళ్లారు.

ప్రేక్షకులను నవ్వించడానికి వెకిలి కామెడీని నమ్ముకోలేదు. అలాగని ప్రత్యేకంగా కామెడీ సీన్లను అతికించినట్లుగా కూడా ఉండదు. అలా కథతోపాటు సిచువేషనల్‌గా కామెడీ వస్తూ మనల్ని నవ్విస్తుంటుంది. అటు ఎమోషనల్‌ సీన్లలో పెద్దగా మెలోడ్రామా ఏమీ లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇక చివర్లో కాస్త దేశభక్తిని కూడా జోడించి రెండో సీజన్‌కు అదిరిపోయే క్లైమాక్స్‌ ఇచ్చారు.

మొత్తంగా పంచాయత్‌ సీజన్‌ 2 ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. తొలి సీజన్‌లాగే ఇందులోనూ మనకు కనిపించే మనుషులు, వాళ్ల జీవితాలు ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో చూసిన, జరిగిన సంఘటనల్లాగే అనిపిస్తాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఈజీగా స్టోరీతో కనెక్ట్‌ అవుతారు. నిజానికి ఇలాంటి కథను ఎంచుకోవడంతోనే మేకర్స్‌ సగం సక్సెస్‌ సాధించారు. ఆ కథను మనసుకు హత్తుకునేలా చేసి సంపూర్ణ విజయాన్ని అందుకున్నారు.