Panchatantram Producer letter: సినిమాల రివ్యూలను, రివ్యూయర్లను తిట్టుకోని ప్రొడ్యూసర్ ఉండడంటే అతిశయోక్తి కాదు. కొంతమంది రివ్యూల వల్ల తమ సినిమాలకు నష్టం వాటిల్లుతుందని ప్రొడ్యూసర్లు భావిస్తారు. అయితే ఇప్పుడు రాబోతున్న పంచతంత్రం మూవీ ప్రొడ్యూసర్ అఖిలేష్ వర్ధన్ మాత్రం రివ్యూలు కావాలంటున్నాడు. ఎలాంటి రివ్యూలైనా సరే తమకు సమ్మతమే అంటున్నాడు.
ఈ పంచతంత్రం మూవీ శుక్రవారం (డిసెంబర్ 9) రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు ప్రేక్షకుల కోసం ప్రొడ్యూసర్ అఖిలేష్ ఓ లేఖ రాశాడు. మొత్తం 17 సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అందులో పంచతంత్రం ఒకటి. ఈ సినిమాల్లో తమ మూవీని ప్రత్యేకంగా నిలపడానికి ప్రొడ్యూసర్ ఇలా ఓ వెరైటీ ప్రయత్నం చేశాడు.
ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలని ఆ లేఖలో ప్రొడ్యూసర్ కోరాడు. "ఈ అందమైన పంచతంత్రం ఇక మీది. 18 నెలల కష్టం, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మా సినిమాని మీ అభిమాన థియేటర్లకు తీసుకొస్తున్నాం. మా కలని మీ ముందు పెడుతున్నాం. తప్పకుండా చూడండి. మా సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. గుండెల్ని హత్తుకుంటుంది.
మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. చిన్నప్పుడు మీ తాత చెప్పిన కథలు గుర్తుకు వస్తాయి. మీరు కచ్చితంగా ఈ కథలతో ప్రేమలో పడతారు. ఈ చక్కటి అనుభూతి కోసం మీరు తప్పకుండా మా పంచతంత్రం చూడాల్సిందే. మీరు మాత్రమే ఈ సినిమాకి న్యాయం చేయగలరు. మీ రివ్యూ ఏవైనా సరే మాకు సమ్మతమే.
మీకు నచ్చినా, నచ్చకపోయినా, తిట్టుకున్నా కూడా మేము దానిని ఆనందంగా స్వీకరిస్తాం. మీరు సినిమా చూసి చెప్పే ప్రతి మాట మాకు అమూల్యమైనది. మీ రివ్యూల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. తప్పకుండా మీ అభిమాన థియేటర్లలో చూడండి. ఇది మా హానెస్ట్ ప్రయత్నం. మా సినిమా రాతని మీకే వదిలేస్తున్నాం.
మొదట్లో కొన్ని థియేటర్లు మాత్రమే ఉన్నా మీ ప్రేమ, ఆదరణతో ఎక్కువ థియేటర్స్‌కు చేరేలా మాకు సహకరించండి. మీకు నచ్చి, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో వెళ్లాలని అందరికీ రికమెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు సినిమా నచ్చకపోతే మీకు నచ్చని వేరే సినిమాలాగనే దీనిని కూడా వదిలేయండి. కానీ తప్పకుండా చూడండి. చూసి మీ ఒపీనియన్ ఏదైనా సరే నాతో షేర్ చేయండి.
ఈ ప్రపంచానికి చూపిద్దాం. సినిమా చిన్నదైనా పెద్దదైనా కంటెంట్ ఉంటే ఆదరించే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారని" అని అంటూ అఖిలేష్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. హర్ష పులిపాక డైరెక్ట్ చేసిన ఈ పంచతంత్రం మూవీలో కలర్స్ స్వాతి, బ్రహ్మానందంలాంటి వాళ్లు నటించారు.
టాపిక్