భారత సినీ పరిశ్రమలో 8 గంటల పని షిఫ్టులపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు పాకిస్థానీ నటి ఇఖ్రా అజీజ్ తన మద్దతు తెలిపింది. 8 గంటల పనిదినం కోరడం వల్లే దీపిక.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ అనే రెండు పెద్ద ప్రాజెక్టుల నుండి వైదొలిగినట్లు వార్తలు రావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
ఇటీవల దీపిక తన 8 గంటల పనిదినం అభ్యర్థన చుట్టూ ఉన్న వివాదంపై స్పందించారు.సీఎన్బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పురుష సూపర్‌స్టార్లు చాలా సంవత్సరాలుగా ఇదే 8 గంటల షెడ్యూల్‌ను అనుసరిస్తున్నారని, కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది తన కుమార్తె దువాకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె కు మద్దతుగా పాకిస్థాన్ నటి ఇఖ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో ముందుకొచ్చింది.
దీపిక ఇంటర్వ్యూ క్లిప్‌ను షేర్ చేస్తూ ఇఖ్రా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక నోట్ పోస్ట్ చేసింది. 'ఇక్కడ అసలు విషయం 8 గంటల షిఫ్ట్ కాదు, ఆమె డిమాండ్ చేసే స్వభావం ఉన్నట్లు చిత్రీకరించడం. పని-జీవిత సమతుల్యత కోసం ప్రయత్నిస్తున్న ఒక తల్లికి మద్దతు ఇవ్వాలి. ఆమె తన కమిట్‌మెంట్‌లను పూర్తి చేస్తున్నంత కాలం ఆమె సహోద్యోగులు టీమ్ ప్లేయర్‌లుగా ఉండి, ఆమె సమయాన్ని గౌరవించాలి' అని ఇఖ్రా జోడించింది.
ఇఖ్రాతో పాటు చిత్రనిర్మాత హన్సల్ మెహతా కూడా సినీ పరిశ్రమలో 8 గంటల పని షిఫ్ట్ విధానంపై జరుగుతున్న చర్చపై సోషల్ మీడియాలో స్పందించారు. 'మా పనిలో 12 గంటల రోజును మర్యాదగా 'షిఫ్ట్' అని పిలుస్తారు. నిజం చెప్పాలంటే, షూటింగ్‌ల గందరగోళం, అంతులేని ప్రయాణాలు, హడావిడి భోజనాలు, కొన్ని గంటల నిద్రలేని రాత్రుల మధ్య,మాలో ఏమీ మిగలదు. ఈ సమీకరణంలో మన మానసిక ఆరోగ్యం లేదా శారీరక శ్రేయస్సు ఎక్కడ సరిపోతుంది?' అని హన్సల్ ఎక్స్ లో రాసుకొచ్చారు.
8 గంటల పనిదినం కోరడం వల్లే సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' నుండి వైదొలిగినట్లు వార్తలు రావడంతో ఇటీవల దీపిక వార్తల్లో నిలిచారు. ఆ ప్రాజెక్ట్‌కు 'అధిక స్థాయి నిబద్ధత' అవసరమని నిర్మాతలు పేర్కొనడంతో ఆమె 'కల్కి 2898 AD' నుండి కూడా తప్పుకున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తన నిర్ణయానికి చాలా వ్యతిరేకత ఎదురవుతోందని చెప్పినప్పుడు దీపిక స్పందించారు.
'ఒక మహిళగా ఉండటం వల్ల, అది మొండిగా లేదా మరేదైనా అనిపిస్తే అలాగే కానివ్వండి. కానీ భారత సినీ పరిశ్రమలో చాలా మంది సూపర్‌స్టార్లు, పురుష సూపర్‌స్టార్లు సంవత్సరాలుగా 8 గంటలు పని చేస్తున్నారనేది రహస్యం కాదు. అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు.
నేను ఇప్పుడు పేర్లు చెప్పి దీన్ని పెద్ద విషయం చేయాలనుకోవడం లేదు, కానీ చాలా మంది పురుష నటులు సంవత్సరాలుగా రోజుకు 8 గంటలు పని చేస్తున్నారని బహిరంగంగా అందరికీ తెలుసు. వారిలో చాలా మంది సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే 8 గంటలు పని చేస్తారు. వారు వారాంతాల్లో పని చేయరు' అని దీపికా చెప్పడం కలకలం రేపింది.
సంబంధిత కథనం