Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. పాతాళ్ లోక్ 2 ట్రైలర్ చూశారా?
Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పాతాళ్ లోక్ రెండో సీజన్ వచ్చేస్తోంది. సోమవారం (జనవరి 6) మేకర్స్ ఈ కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కొత్త సీజన్ కొత్త కేసుతో ఇన్‌స్పెక్టర్ హథీరాం చౌదరి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Crime Thriller Web Series: పాతాళ్ లోక్.. ఓటీటీలో ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నాలుగేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు కొత్త సీజన్ తో మేకర్స్ వస్తున్నారు. జనవరి 17 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న పాతాళ్ లోక్ సీజన్ 2 ట్రైలర్ ను సోమవారం (జనవరి 6) రిలీజ్ చేశారు.
పాతాళ్ లోక్ సీజన్ 2 ట్రైలర్
ఓటీటీలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన జైదీప్ అహ్లావత్ మరోసారి ఇన్‌స్పెక్టర్ హథీరాం చౌదరికి రాబోతున్నాడు. ఈసారి అండర్ వరల్డ్ లోని సరికొత్త కేసుతో అలరించబోతున్నాడు. ఈ మధ్యే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ సోమవారం (జనవరి 6) ట్రైలర్ తో రెండో సీజన్ స్టోరీని రివీల్ చేశారు. ఈసారి కథ ఢిల్లీ నుంచి నాగాలాండ్ చేరనుంది.
అక్కడి ఓ పార్టీ వ్యవస్థాపకుడి హత్య కేసు విచారణ చుట్టూ ఈ కొత్త సీజన్ సాగనుంది. "కొత్త కేసు, కొత్త ప్లేసు, కొత్త పాతాళ్ లోక్.. పాతాళ్ లోక్ కొత్త సీజన్ జనవరి 17 నుంచి" అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో ఈ ట్రైలర్ ను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇందులో ఇన్‌స్పెక్టర్ హథీరాం చౌదరిగా జైదీప్ అహ్లావత్, ఐపీఎస్ ఆఫీసర్ ఇమ్రాన్ అన్సారీగా ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.
పాతాళ్ లోక్ 2 ట్రైలర్ ఎలా ఉందంటే?
పాతాళ్ లోక్ సీజన్ 1లో ఇన్‌స్పెక్టర్ హథీరాం కింద పని చేసే ఇమ్రాన్ అన్సారీ కొత్త సీజన్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా తిరిగి వస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి నాగాలాండ్ లో జరిగిన పార్టీ వ్యవస్థాపకుడి హత్య కేసు విచారణ ఎలా ఎదుర్కొన్నారన్నది ఈ కొత్త సీజన్లో చూపించనున్నారు.
అవినాష్ అరుణ్ ధావరే డైరెక్ట్ చేసిన ఈ కొత్త సీజన్ పాతాళ్ లోక్ కూడా మరింత గ్రిప్పింగ్ నెరేటివ్ తో ఆకట్టుకోబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. తొలి సీజన్లో హథీరాం చౌదరి అనే ఇన్‌స్పెక్టర్ గా జైదీప్ అహ్లావత్ అదిరిపోయే నటనతో కట్టిపడేశాడు. రెండో సీజన్ కూడా అతని వ్యక్తిగత జీవితంతోపాటు అతడు కొత్తగా పరిష్కరించబోయే కేసు చుట్టూ తిరగనుంది.
పాతాళ్ లోక్ సీజన్ 1లో ఏం జరిగిందంటే?
పాతాళ్ లోక్ సీజన్ 1 హథీరాం చౌదరి (జైదీప్ అహ్లావత్) అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. అతనికి ఓ జర్నలిస్ట్ పై జరిగిన హత్యాయత్నం కేసు ఇస్తారు. దాని మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన అతడు మరో ప్రపంచంలోకి వెళ్తాడు. అదే పాతాళ్ లోక్. అక్కడి క్రైమ్ బయటి ప్రపంచంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందన్న నిజం అతనికి తెలుస్తుంది.
ఢిల్లీలోని తూర్పు ఢిల్లీలో జరిగిన కథగా దీనిని తెరకెక్కించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచీ రెండో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి పాతాళ్ లోక్ 2 జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది.