OTT Web Series: ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. దేశ విభజన సమయంలో ఏం జరిగింది?
OTT Web Series: ఓటీటీలోకి హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రాబోతోంది. దేశ విభజన సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వాయిదా పడుతూ వస్తున్న స్ట్రీమింగ్ తేదీని తాజాగా అనౌన్స్ చేశారు.
OTT Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. అసలు దేశ విభజనకు కారణం ఎవరు? గాంధీ, సర్దార్ మధ్య గొడవేంటి? తొలి ప్రధాని పదవి చివరి నిమిషంలో ఎందుకు చేతులు మారింది? ఇలాంటి విషయాలతో తెరకెక్కిన ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో సిరీస్ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ ఓటీటీ రిలీజ్ డేట్
సోనీలివ్ ఓటీటీ చాలా రోజులుగా ప్రమోట్ చేస్తున్న వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. రెండు నెలల కిందటే రావాల్సిన ఈ సిరీస్ వాయిదా పడుతూ ఇప్పుడు నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సోమవారం (నవంబర్ 4) ఈ విషయాన్ని సదరు ఓటీటీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
"మీకు తెలియని చరిత్ర.. మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీ మూడో డ్రాప్ ఇది. ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ నవంబర్ 15 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ వెల్లడించింది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్.. తెలుసుకోవాల్సిన చరిత్ర
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ వెబ్ సిరీస్ నుంచి తాజాగా డ్రాప్ 3 రిలీజ్ చేశారు. ఇందులో మొదట్లోనే ముంబైలో ముస్లిం లీగ్ ధర్నా తర్వాత అల్లర్లు మొలయ్యాయని సర్దార్ పటేల్ కు చెబుతుండటం చూడొచ్చు. సెక్షన్ 144 అమలు చేయండి.. అల్లర్లను ఆపడానికి ఏం చేయాల్సి వస్తే అది చేయండి అని సర్దార్ సూచిస్తారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న గాంధీజీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు.
బ్రిటీష్ వాళ్లు లాఠీఛార్జీలు చేశారు.. మనమూ చేస్తున్నాం.. అంటూ సర్దార్ ను నిలదీస్తారు. అది దౌర్జన్యం.. ఇది బాధ్యత అంటూ ఆయనకు సర్దార్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత దేశ విభజన విషయంలోనూ ఇద్దరి మధ్యా వాగ్వాదం జరుగుతుంది. తనకు సలహా ఇవ్వడానికి ప్రయత్నించి బాపుని.. తన కుర్చీలో కూర్చొని ఆ పని చేయాలని సర్దార్ అంటారు.
దేశం కోసమే ఆలోచించేవాడివైతే.. తన పదవిని జిన్నాకు వదిలేయాలని సర్దార్ ను బాపు కోరతారు. ఆ తర్వాత కొన్ని ఇంటెన్స్ విజువల్స్ ప్లే అవుతాయి. అందులో హిందూ, ముస్లిం గొడవలు.. దేశ విభజన ఉద్రిక్తతల వంటివి చూడొచ్చు. గతంలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన రెండు డ్రాప్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సోనీలివ్.. తాజాగా ఈ మూడో డ్రాప్ తో సిరీస్ పై అంచనాలను పెంచేసింది. తెలియని చరిత్ర, తెలుసుకోవాల్సిన చరిత్ర అంటూ వస్తున్న ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్.. దేశ విభజనకు సంబంధించిన ఎలాంటి అంశాలను తీసుకురానుందో చూడాలి. నిఖిల్ అద్వానీ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.