OTT Movie: కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు.. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ
OTT Movie: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేస్తోంది. కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదంటూ.. 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ లో పోటీ చేస్తానంటూ పట్టుబట్టే ఓ వృద్ధుడి చుట్టూ తిరిగే స్టోరీతో ఈ సినిమా రాబోతోంది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 29) ట్రైలర్ రిలీజ్ చేశారు.
OTT Movie: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు విజయ్ 69. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించిన ఈ సినిమా కలలకు వయసుతో సంబంధం లేదు.. అసలు వాటికి ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉండదనే సందేశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 29) ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
విజయ్ 69 ఓటీటీ రిలీజ్ డేట్
విజయ్ 69.. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదని నిరూపించే మరో సినిమా ఇది. యువకులు కూడా జడుసుకునే ట్రయథ్లాన్ లాంటి కఠినమైన ఈవెంట్ లో ఓ 69 ఏళ్ల వృద్ధుడు పాల్గొంటే ఎలా ఉంటుంది? కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదంటూ వస్తున్న ఈ సినిమా నవంబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తి రేపారు. ఇందులో 69 ఏళ్ల వృద్ధుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు. అతని పట్టుదల ముందు వయసు కూడా ఓడిపోతుందా? తన కలను అతడు సాకారం చేసుకుంటాడా అన్నదే ఈ విజయ్ 69 మూవీ కథ.
విజయ్ 69 ట్రైలర్
విజయ్ 69 మూవీ ట్రైలర్ ను మంగళవారం (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో విజయ్ అనే వృద్ధుడి పాత్రలో అనుపమ్ ఖేర్ జీవించేసినట్లు ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే వస్తున్న సినిమా ఇది.
69 ఏళ్ల వయసు వచ్చినా తాను ఇప్పటికీ యువకుడినే అని వాదించే ఓ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ స్టోరీ ఇది. చనిపోయిన తర్వాత కూడా తాను సాధించినదానిని అందరూ గుర్తు పెట్టుకోవాలని విజయ్ అనుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే తాను 69 ఏళ్ల వయసులో ట్రయథ్లాన్ లో పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. దీని ద్వారా ఇండియాలో ఓ కొత్త రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తాడు.
ఈ ట్రయథ్లాన్ లో భాగంగా 1.5 కి.మీ. స్విమ్మింగ్, 40 కి.మీ. సైక్లింగ్, 10 కి.మీ. రన్నింగ్ పూర్తి చేస్తానని తన ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఛాలెంజ్ విసురుతాడు. అతని మాటలు విని అందరూ నవ్వుతారు తప్ప ఎవరూ ప్రోత్సహించరు. అయినా అతడు తన పంతం వీడడు. ఆ ట్రయథ్లాన్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఈ క్రమంలో వయసు విసిరే సవాళ్లతో చిత్తవుతుంటాడు.
చివరికి ట్రయథ్లాన్ నిర్వాహకులు కూడా అతని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయ్ తన కలను సాకారం చేసుకుంటాడా? తాను అనుకున్నట్లు ట్రయథ్లాన్ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేస్తాడా అన్నది ఈ మూవీలో చూడొచ్చు. మనీష్ శర్మ నిర్మించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పిస్తుండగా.. అక్షయ్ రాయ్ డైరెక్ట్ చేశాడు. విజయ్ 69 సినిమా నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.