OTT January Top Movies: ఓటీటీల్లోకి జనవరిలో రానున్న టాప్-5 సినిమాలు ఇవే! ఒబామా మెచ్చిన భారతీయ చిత్రం కూడా..
OTT January 2025 Top Movies: 2025 జనవరిలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేయనున్నాయి. వాటిలో టాప్-5 మూవీ ఓటీటీ రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
2024 ముగింపునకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో కొత్త ఏడాది 2025 అడుగుపెట్టనుంది. ఈ కొత్త సంవత్సరం తొలి నెల జనవరిలోనూ వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో చాలా చిత్రాలు క్యూకట్టనున్నాయి. డిఫరెంట్ రకాల సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. వాటిలో జనవరిలో ఓటీటీల్లోకి రానున్న టాప్-5 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్
‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చాలా ప్రశంసలు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమై.. గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు తనకు నచ్చిన చిత్రాల్లో ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఉందని వెల్లడించారు. ఈ భారతీయ మూవీని మెచ్చారు. ఇంతటి ప్రశంసలు పొందిన ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనవరి 3వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో కని కశ్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలు పోషించగా.. పాయల్ కాపాడియా దర్శకత్వం వహించారు. ఇద్దరు నర్సుల జీవితం చుట్టూ ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ సాగుతుంది. జనవరి 3 నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
పుష్ప 2: ది రూల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ చిత్రం కూడా జనవరిలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ మూవీ ఇప్పటికే రూ.1,700 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి ఈ క్రమంలో చాలా రికార్డులను బద్దలుకొట్టింది. థియేటర్లలో రిలీజైన 56 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని మూవీ టీమ్ చెప్పింది. దీంతో జనవరి చివరి వారంలో ఈ పుష్ప 2 మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందనే వాదనలు ఉన్నాయి. ఒకవేళ థియేట్రికల్ రన్ ఇలా విధంగా జోరుగా ఉంటే ఆలస్యం కావొచ్చు.
విడుదలై 2
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన విడుదలై 2 (తెలుగులో విడుదల 2) జనవరిలో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది. జనవరి మూడో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందే అంచనాలు ఉన్నాయి. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ విడుదలై 2 డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
యూఐ
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన క్రేజీ మూవీ యూఐ కూడా జనవరిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం డిసెంబర్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఉపేంద్ర హీరోగా నటించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. యూఐ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ ఓటీటీ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జనవరిలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మరి ఆ ఓటీటీలోనే వస్తుందా.. వేరే ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెడుతుందా అనేది చూడాలి.
పని
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పని’ కూడా జనవరిలోనే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో జోజూ జార్జ్, సాగర్ సూర్య, జునైజ్ ప్రధాన పాత్రలు పోషించారు. పని మూవీకి జోజూ జార్జే దర్శకత్వం వహించారు.