OTT Thriller Web Series: ఈ ఇయర్ ఎండ్ మంచి థ్రిల్ కావాలా.. అయితే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అస్సలు మిస్ కావద్దు..
OTT Thriller Web Series: థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే మీకు ఇష్టమా? ఈ ఇయర్ ఎండ్ ను మంచి థ్రిల్ తో ముగించాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను అస్సలు మిస్ కావద్దు. జీ5 ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన వెబ్ సిరీస్ అది.
OTT Thriller Web Series: ఓటీటీ వచ్చిన తర్వాత థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు అసలు కొదవే లేకుండా పోయింది. ఈ జానర్లో వచ్చే కంటెంట్ కు క్రమంగా ప్రేక్షకులు పెరుగుతుండటంతో చాలా వరకు ఓటీటీ ఒరిజినల్స్ వీటి చుట్టే తిరుగుతోంది. తాజాగా సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లో వచ్చిన అలాంటి వెబ్ సిరీసే ఖోజ్: పర్చాయోంకే ఉస్ పార్ (Khoj: Parchiyo ke uss paar). జీ5 (zee5) ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఖోజ్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి?
కథలో ట్విస్టులతో, ఊహకందని క్లైమ్యాక్స్ లతో థ్రిల్లర్ స్టోరీలు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమాలైనా, వెబ్ సిరీస్ అయినా థ్రిల్లర్ జానర్ కు ఆడియెన్స్ ప్రత్యేకంగా ఉంటారు. అలా వచ్చిన వెబ్ సిరీసే ఖోజ్: పర్చాయోంకే ఉస్ పార్. ఈ సిరీస్ లో షరీబ్ హష్మి, అనుప్రియా గోయెంకా, ఆమిర్ దల్విలాంటి వాళ్లు నటించారు. ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రబల్ బారువా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మొత్తం ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగబోతోందో అన్న సస్పెన్స్ తో ముగించారు.
తన భార్య మీరా తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తాడు వేద్ అనే ఓ హైకోర్టు లాయర్. ఈ కేసు విచారణను చేపట్టిన పోలీస్ ఆఫీసర్ కు పలు సందేహాలు వస్తుంటాయి. వాటి గుట్టును తేల్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే మరుసటి రోజే అతని భార్య దొరికిందంటూ ఆమెను అతని ఇంటికే తీసుకెళ్లి అప్పగిస్తాడు. ఆమె తన భార్య కాదంటూ అతడు వాదిస్తాడు.
అయితే ఇంట్లో అతడు చూపించిన సాక్ష్యాలన్నీ వేద్ కు వ్యతిరేకంగానే ఉంటాయి. తన కన్న కూతురు కూడా ఆమెనే అమ్మా అని పిలుస్తుంది. ఆ పోలీస్ అధికారి తీసుకొచ్చిన వ్యక్తే మీరా అని నమ్మలేకపోతాడు వేద్. ఆమె తన భార్య కాదని నిరూపించడానికి చాలా ప్రయత్నాలే చేస్తాడు. కానీ ఈ క్రమంలో తనకే మానసిక ఆరోగ్యం సరిగా లేదని, రెండేళ్లుగా చికిత్స పొందుతున్నాడని వేద్ నే నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఆ వ్యక్తి.
చివరికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను కూడా ఆ నకిలీ మీరా గురించి ఆరా తీయడానికి వేద్ ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి గురించి అతనికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తుంటాయి. తాను అతని భార్యనే అంటూ వేద్ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? చివరికి అతని భార్య దొరుకుతుందా? క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి అన్నది ఈ ఖోజ్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
ఖోజ్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
ఖోజ్ వెబ్ సిరీస్ స్టోరీతో గతంలోనూ బాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. అయితే తెలిసిన స్టోరీని ఇంట్రెస్టింగా చెబుతూ.. చివరి ఎపిసోడ్ వరకూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఈ సిరీస్ మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. డిసెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభిస్తోంది.
అటు రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ స్టోరీ ఎలా ఉండాలో అలాగే సాగుతుంది ఈ ఖోజ్ వెబ్ సిరీస్ కూడా. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్. ఇక లీడ్ రోల్స్ లో నటించిన షరీబ్ హష్మి, అనుప్రియా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా మంచి థ్రిల్ కావాలనుకుంటే ఈ ఖోజ్: పర్చాయోంకే ఉస్ పార్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.