ఓటీటీలో కేవలం తెలుగు కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్. ఈమధ్య ఆ ఓటీటీ కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం సరికొత్త సినిమాలను అందిస్తోంది. సందేశాత్మకంగా సాగే ఈ సిరీస్ నుంచి ఇప్పుడు ఓ రొమాంటిక్ కామెడీ సినిమా కూడా వస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం (మే 6) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా వస్తున్న సరికొత్త మూవీ సుందరం గాడి ప్రేమ కథ. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చే ఆదివారం (మే 11) ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మించాడు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు.
“ఓ క్రేజీ రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ మొదలైంది. సుందరం గాడి ప్రేమ కథ మే 11 నుంచి కేవలం ఈటీవీ విన్‌లో. నవ్వులు, ప్రేమ, డ్రామా గ్యారెంటీ. స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్, దర్శకత్వ పర్యవేక్షణ: కే. రాఘవేంద్ర రావు. స్టోరీ సత్యానంద్, డైరెక్టర్: రాంకీ. నటీనటులు: అంకిత్ కొయ్య, లాస్య భావన, శివనారాయణ, మ్యూజిక్: డాక్టర్ జోస్యభట్ల” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీలో మే నెలలో సరికొత్త సినిమాలు చాలానే అడుగుపెట్టాయి. మరికొన్ని అడుగుపెట్టబోతున్నాయి. వాటిలో మే నెల తొలి రోజే ముత్తయ్య అనే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 60 ఏళ్ల వయసులోనూ నటనపై మక్కువతో సినిమాల్లో నటించాలని తపించే ఓ వృద్ధుడి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక యాంకర్ ప్రదీప్ నటించిన మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా ఇదే నెలలో ఓటీటీలోకి రాబోతోంది. మే 8న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఓ ఊళ్లో 60 మంది అబ్బాయిల తర్వాత పుట్టిన ఏకైక అమ్మాయి.. ఆ ఊరి పెద్ద నిర్ణయానికి విరుద్ధంగా బయటి నుంచి వచ్చిన వ్యక్తిని ప్రేమించడం అనే సరికొత్త కథతో వచ్చిన సినిమా ఇది.
ఇక మే నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలోకి ఓ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ వస్తోంది. జూన్, 2023లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండేళ్ల తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ మూవీ పేరు పెండులమ్. మే 22న ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది.
అంతు చిక్కని విధంగా జరిగిన ఓ ఘటన నిగ్గు తేల్చడానికి ఓ కల కనడం ద్వారా ప్రయత్నించే ఓ డాక్టర్ స్టోరీ ఇది. ఇవే కాకుండా మరో నాలుగు సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక నాతి చరామి అనే మరో సినిమా మే 25న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అదే కథా సుధ నుంచి మే 18న కాలింగ్ బెల్ అనే మరో సినిమా రానుంది.
సంబంధిత కథనం