OTT Telugu movies: ఈవారం ఓటీటీల్లోకి నాలుగు తెలుగు సినిమాలు.. కామెడీ, హారర్, బోల్డ్..
OTT Telugu Movies This week: ఈ వారం ఓటీటీల్లోకి నాలుగు తెలుగు సినిమాలు వచ్చేశాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. రెండు సినిమాలు నేరుగా ఓటీటీలోకే ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో ఓ బోల్డ్ థ్రిల్లర్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. నాలుగు చిత్రాల్లో రెండు ఆహా ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చాయి.
సెలవులు ఎక్కువగా ఉన్న ఈ వారంలో ఓటీటీల్లో కొత్తగా తెలుగు సినిమాలు చూడాలనుకునే వారికి నాలుగు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ జానర్లలో సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ కామెడీ మూవీగా వీరాంజనేయులు విహారయాత్ర మూవీ నేరుగా ఓటీటీలోకే వచ్చేసింది. మరో బోల్డ్ మూవీ కూడా డైరెక్టుగానే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, డార్లింగ్ కూడా ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు తెలుగు సినిమాలు ఏవంటే..
వీరాంజనేయులు విహారయాత్ర
సీనియర్ యాక్టర్ నరేశ్ ప్రధాన పాత్ర పోషించిన వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ బుధవారం (ఆగస్టు 14) ఈ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. అస్థికలను గోవాలో కలిపేందుకు ఫ్యామిలీ మొత్తం కారులో ట్రిప్‍లు వెళ్లడం, వారి జీవితాల్లోని ఇబ్బందుల చుట్టూ వీరాంజనేయులు విహారయాత్ర మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, రాగ్ మయూర్, ప్రియ వడ్లమణి, ప్రియదర్శిని, తరుణి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్‍లో వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని చూసేయవచ్చు.
డార్లింగ్
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నభా నటేష్ జోడీగా నటించిన డార్లింగ్ చిత్రం గత నెల థియేటర్లలో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఈ మంగళవారం (ఆగస్టు 13) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. భార్యతో పారిస్‍కు తీసుకెళ్లాలని జీవితాశయంగా పెట్టుకునే యువకుడికి స్ల్పిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయితో పెళ్లి జరగడం, ఎదురైన ఇబ్బందుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. డార్లింగ్ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో వీక్షించొచ్చు. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించగా.. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
ఓఎంజీ
ఓ మంచి ఘోస్ట్ (ఓఎంజీ) అనే కామెడీ హారర్ సినిమా నేడు (ఆగస్టు 15) ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. జూన్ 21వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకొని నిరాశపరిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఆహాలో అడుగుపెట్టింది. ఓఎంజీ చిత్రంలో వెన్నెల కిశోర్, షకలక శంకర్, నందిత శ్వేత, నవమి గాయక్, నవీన్ నేని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని దర్శకుడు శంకర్ కే మార్తాండ్ తెరకెక్కించారు. దెయ్యం ఉండే ఓ బంగ్లాలోకి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకురావడం చుట్టూ ఓఎంజీ సినిమా సాగుతుంది.
ఎవోల్
ఎవోల్ సినిమా నేడు (ఆగస్టు 15) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వచ్చింది. యోగి వెలగపూడి దర్శకత్వం వహించిన ఈమూవీలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్స్ చేశారు. లవ్ ఇంగ్లిష్ స్పెల్లింగ్‍ను తిరగేసి రాస్తే వచ్చే ఎవోల్ టైటిల్‍తో ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాను ఆహాలో చూడొచ్చు.