OTT Telugu Movie: ఓటీటీల్లో ఈ వీకెండ్ తెలుగు సినిమాలు చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వారం (మే రెండో వారం) ఓటీటీల్లోకి కొత్తగా బాగానే సినిమాలు అడుగుపెట్టాయి. హారర్ కామెడీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నుంచి సిట్ వరకు కొన్ని చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. విజయ్ ఆంటోనీ మూవీ తెలుగు వెర్షన్ లవ్ గురు కూడా అందుబాటులోకి వచ్చింది. అలా.. ఈ వారం ఓటీటీల్లో తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఐదు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘చిత్రం చూడరా’ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వారంలోనే మే 9వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది. చిత్రం చూడరా సినిమాకు ఆర్ఎస్ హర్షవర్దన్ దర్శకత్వం వహించారు.
సిట్ (స్పెషల్ ఇన్పెస్టిగేషన్ టీమ్) సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 10వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కూడా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, రుచిత సాధినేని ప్రధాన పాత్రలు పోషించగా.. విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ సిట్ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా నటించిన ‘రోమియో’ చిత్రం తెలుగులో ‘లవ్ గురు’ పేరుతో వచ్చింది. థియేటర్లలో ఏప్రిల్ 11న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నెలలోగానే ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు వెర్షన్ ‘లవ్ గురు’ సినిమా మే 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంలో రోమియో మూవీ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా తమిళ్‍లోనూ అందుబాటులో ఉంది. లవ్ గురు చిత్రానికి వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.
కామెడీ హారర్ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఈ వారం రెండు ఓటీటీల్లో అడుగుపెట్టింది. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ థియేటర్లలో ఏప్రిల్ 11న విడుదలై.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మే 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. మే 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. అలా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం రెండు ఓటీటీల్లో చూసేందుకు అవకాశం ఉంది. ఈ మూవీకి కోన వెంకట్ కథ అందించగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు.
పార్థు సినిమా మే 9వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. తమిళ మూవీ ఊమై సెన్నైకు తెలుగు వెర్షన్‍గా ఈ చిత్రం అడుగుపెట్టింది. 2021లో ఊమై సెన్నై థియేటర్లలో విడుదల కాగా.. మూడేళ్ల తర్వాత తెలుగులో డబ్బింగ్ అయి ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అర్జున్ ఏకలవ్యన్ దర్శకత్వం వహించారు. పార్థు చిత్రంలో మైకేల్ తంగదురై, సనమ్ శెట్టి, జయకుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.
మలయళ సూపర్ హిట్ ‘ఆవేశం’ చిత్రం మే 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ప్రస్తుతం మలయాళం భాషలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది.