OTT March Telugu Movies: ఈనెలలో ఓటీటీలోకి వచ్చిన ముఖ్యమైన 6 తెలుగు సినిమాలు.. మీరు చూసేశారా!
OTT March Telugu Movies: ఈనెలలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కొన్ని తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన పాపులర్ మూవీస్ ఉన్నాయి.
March OTT Telugu Movies: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈనెల (మార్చి, 2024)లోనూ చాలా సినిమాలు అడుగుపెట్టాయి. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో కొన్ని తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. ఎంతోకాలం నుంచి వేచిచూసిన హనుమాన్ చిత్రం కూడా ఈనెలలోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది.ఊరు పేరు భైరవకోన సహా మరిన్ని మూవీస్ ఓటీటీల్లోకి వచ్చాయి. అలా.. మార్చిలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఆరు ముఖ్యమైన తెలుగు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ఈగల్
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ సినిమా మార్చి 1వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈటీవీ విన్‍తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈగల్ మూవీ థియేటర్లలో ఫిబ్రవరి 9న రిలీజైంది. నెలలోగానే రెండు ఓటీటీల్లోకి ఈ చిత్రం అడుగుపెట్టింది.
ఊరు పేరు భైరవకోన
సూపర్ నేచులర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా థియేటర్లలో మంచి హిట్ అయింది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. కాగా, ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా మార్చి 8వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
హనుమాన్
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన బ్లాక్‍బస్టర్ సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’ మార్చి 17వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అంతకు ఒక్కరోజు ముందే ఈ మూవీ హిందీ వెర్షన్ జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించారు. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‍బస్టర్ అయింది. రెండు నెలల నిరీక్షణ తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జీ5, జియోసినిమా ఓటీటీల్లోనూ దూసుకెళుతోంది.
ఆపరేషన్ వాలెంటైన్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 22వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. శక్తిప్రతాస్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‍గా నటించారు. ఈ ఏరియల్ యాక్షన్ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజై.. అంచనాలను అందుకోలేకపోయింది. మూడు వారాల్లోనే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది.
భూతద్దం భాస్కర్ నారాయణ
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ మంచి హైప్ తెచ్చుకుంది. ఈ చిత్రం మార్చి 22వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. శివ కందుకూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలో ఈ డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా విడుదలైంది. మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చు.
సుందరం మాస్టర్
సుందరం మాస్టర్ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 28వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కమెడియన్ హర్ష చెముడు (వైవా హర్ష) ఈ చిత్రంతో హీరో అయ్యారు. ఈ కామెడీ థ్రిల్లర్ డ్రామాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించగా.. స్టార్ హీరో రవితేజ నిర్మించారు. ఫిబ్రవరి 23న థియేటర్లలో సుందరం మాస్టర్.. సుమారు నెల తర్వాత ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది.
మరిన్ని..
రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించిన హారర్ థ్రిల్లర్ మూవీ వళరి నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 6న స్ట్రీమింగ్‍కు వచ్చింది. బోల్డ్ కంటెంట్‍తో మిక్స్అప్ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మార్చి 15న అందుబాటులోకి వచ్చింది. అభినవ్ గోమటం హీరోగా నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా చిత్రం మార్చి 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.