OTT Telugu Action Thriller: ఓటీటీలో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ హవా.. ఆరు రోజుల్లోనే ఆ రికార్డు
OTT Telugu Action Thriller: ఓటీటీలో ఇప్పుడో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ దూసుకెళ్తోంది. ఈ నెల 20న ఆహా వీడియోలోకి అడుగుపెట్టిన ఆ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దీంతో ఆరు రోజుల్లోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
OTT Telugu Action Thriller: థియేటర్లలో బోల్తా పడిన సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ జీబ్రా కూడా అదే పని చేస్తోంది. థియేటర్లలో పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాని ఈ మూవీ.. ఆహా వీడియోలో మాత్రం దుమ్ము రేపుతోంది. ఆరు రోజుల్లోనే 100 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.
జీబ్రా ఓటీటీ స్ట్రీమింగ్ రికార్డు
సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఆహా వీడియోలో డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు మాత్రం డిసెంబర్ 18 నుంచే అందుబాటులోకి వచ్చింది.
గురువారానికి (డిసెంబర్ 26) ఈ మూవీ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ పూర్తి చేసుకున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది. "హైప్ నిజమైనదే. థ్రిల్ అన్‌స్టాపబుల్. జీబ్రా మూవీ ఆహా వీడియోలో చూడండి" అనే క్యాప్షన్ తో ఈ 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
జీబ్రా మూవీ స్టోరీ ఇదీ..
జీబ్రా మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సత్య దేవ్ కీలక పాత్ర లో కనిపించాడు. నవంబర్ 22న జీబ్రా మూవీ థియేటర్లలో రిలీజైంది. సత్యదేవ్ రీసెంట్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (సత్యదేవ్) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్.
బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు అందులోని లోతుపాతులపై పూర్తిగా అవగాహన ఉంటుంది. తన బ్యాంకులోనే పనిచేసే స్వాతిని (ప్రియా భవానీ శంకర్) ఇష్టపడతాడు. ఆమెను పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. ఓ వ్యక్తి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌లో వేస్తుంది స్వాతి. తన తెలివితేటలతో స్వాతి పొగొట్టుకున్నడబ్బును రాబడుతాడు సత్య.
అదే టైమ్‌లో మరో బ్యాంక్‌లో సూర్య పేరుతో ఉన్న అకౌంట్‌లో ఐదు కోట్లు పడతాయి. ఆ డబ్బు తీసుకునే లోపే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ ఐదు కోట్లు ఎక్కడివి? అది తన డబ్బే అంటూ గ్యాంగ్ స్టర్ ఆది (డాలీ ధనుంజయ).. సూర్యను ఎందుకు బెదిరించాడు? తన అకౌంట్‌లో పడిన డబ్బును ఆదికి సూర్య ఎలా చెల్లించాడు? అనే అంశాలతో దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ జీబ్రా మూవీని తెరకెక్కించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ మీరు చూసి ఉండకపోతే వెంటనే ఆహా వీడియోలో చూసేయండి.