OTT Crime Thriller: థియేటర్లలో కాకుండా ఓటీటీలోకే నేరుగా మరో సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు గ్యారా గ్యారా. అంటే పదకొండు పదకొండు. కాలంలో వెనక్కి వెళ్లి గతాన్ని మార్చవచ్చా అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు బుధవారం (జులై 24) రిలీజైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. గతం, ప్రస్తుతం ఉన్న ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కొన్ని ఘటనలను జరగకుండా చేయడానికి చేసే ప్రయత్నమే గ్యారా గ్యారా మూవీ.
టైమ్ అనేది కేవలం ఓ భ్రమేనా? సమయానికి మనం అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామా? మనిషి తలచుకుంటే గతంలోకి వెళ్లి వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చగలడా? ఆలోచించడానికే చాలా వింతగా ఉంది కదూ. ఇప్పుడు వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గ్యారా గ్యారా కథ ఇదే. ఉమేష్ బిస్త్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీలోనే రిలీజ్ కానుంది.
ఈ గ్యారా గ్యారా సినిమా ఆగస్ట్ 9 నుంచి తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్రైలర్ రిలీజ్ చేస్తూ జీ5 ఓటీటీ వెల్లడించింది. ఈ గ్యారా గ్యారా సినిమాలో ధైర్య కార్వా, కృతికా కామ్రా, రాఘవ్ జుయెల్, గౌతమి కపూర్, గౌరవ్ శర్మ, ముక్తి మోహన్ లాంటి వాళ్లు నటించారు. రెండు కాలాల మధ్య తిరుగుతూ మూవీ ట్రైలరే ఎంతో ఆసక్తి రేపుతోంది.
సమయం అనేది కేవలం ఒక భ్రమే అని చెబుతూనే ఈ గ్యారా గ్యారీ మూవీ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో 1990ల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి ఓ రహస్య వాకీటాకీ ద్వారా ఇప్పటి పోలీస్ అధికారిని సంప్రదిస్తాడు. అది కూడా కేవలం 60 సెకన్ల పాటు మాత్రమే. సరిగ్గా రాత్రి 11:11 గంటల సమయంలో వాళ్ల మధ్య ఆ సంభాషణ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు గ్యారా గ్యారా అనే టైటిల్ పెట్టారు.
ఇందులో 1990ల్లో పోలీస్ ఆఫీసర్ శౌర్య పాత్రలో ధైర్య కార్వా నటించాడు. ఇక ఇప్పటి పోలీస్ ఆఫీసర్ యుగ్ ఆర్యగా రాఘవ్ జుయెల్ కనిపించాడు. అనుకోకుండా అప్పటి అధికారితో మాట్లాడిన ఈ యువ పోలీస్ ఆఫీసర్ గతంలో జరిగిన ఆ క్రైమ్ ను ఆపడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. అయితే వాళ్లు వేర్వేరు కాలాల్లో ఉన్నట్లు మొదట్లో వాళ్లకు తెలియదు.
మరి ఈ ఇద్దరూ కలిసి గతంలో జరిగిన ఆ ఘటనను మార్చి వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చగలరా? అది వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపింది అన్నది ఈ గ్యారా గ్యారా సినిమాలో చూడొచ్చు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలరే సినిమాపై అంచనాలను పెంచేసింది. కరణ్ జోహార్, గునీత్ మోంగా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి ఆగస్ట్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా అన్నది చూడాలి.