OTT Romantic Comedy: ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే
OTT Romantic Comedy: ఓటీటీలోకి ఓ మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగులోనూ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 10) ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.

OTT Romantic Comedy: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (Love Under Construction). మొత్తంగా ఏడు భాషల్లో వస్తున్న ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ సోమవారం (ఫిబ్రవరి 10) రిలీజ్ చేశారు. నీరజ్ మాధవ్, అజు వర్గీస్, గౌరి జీ కిషన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ కొత్త ఇల్లు, లవర్ మధ్య చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యే ఓ యువకుడి చుట్టూ తిరుగుతుంది.
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఓటీటీ రిలీజ్ డేట్
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ను కొన్నాళ్ల కిందటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. ఈ వాలెంటైన్స్ డేకే వస్తుందని భావించారు. అయితే మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
గల్ఫ్ వెళ్లి కాస్త డబ్బులు పోగేసి సొంతూళ్లో ఇల్లు కట్టుకోవాలనుకునే ఓ సాధారణ మధ్య తరగతి మలయాళీ యువకుడి జీవితం ప్రేమలో పడిన తర్వాత ఎలా మారిపోయిందో ఈ సిరీస్ లో చూడొచ్చు. ఇల్లు కట్టుకోవాలన్న అతని కల లవర్ కారణంగా ఎలా దారి తప్పిందన్నది చూపించే ప్రయత్నం చేశారు.
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ట్రైలర్
ఇల్లు కట్టుకోవాలని కలలు కనే ఓ యువకుడు చివరికి తన ప్రేమను నిర్మించుకునే పనిలో పడతాడు. అందుకే ఈ సిరీస్ కు వెరైటీగా లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ అనే పేరు పెట్టారు. ఇందులో వినోద్ అనే పాత్రలో నీరజ్ మాధవ్ నటించాడు. ఏదో ఇల్లు ఉంటే చాలానుకునే అతనికి కుటుంబం నుంచి మొదట అడ్డంకులు ఏర్పడతాయి.
ఇల్లు చాలా రిచ్ గా ఉండాలన్న కండిషన్ పెడతారు. అదే సమయంలో వయసు కూడా మీద పడటంతో పెళ్లి చేసుకోవాలని తొందర పడే అతడు ఓ అమ్మాయి (గౌరి) ప్రేమలో పడతాడు. కానీ అతని రెండు కలలు ఒకేసారి నెరవేరడం అంత సులువు కాదు. ఈ సమయంలోనే వీళ్ల ప్రేమకు సాయం చేయడానికి అజు వర్గీస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ సిరీస్ లో చూడాలి.
మొత్తానికి ఇల్లు, ప్రేమ, పెళ్లి మధ్య ఇరుక్కునే యువకుడి జీవితాన్ని కాస్త సరదాగా నవ్విస్తూ తీసే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ ఫన్నీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ చూడటానికి సిద్ధంగా ఉండండి.
సంబంధిత కథనం