Romantic Comedy OTT: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Romantic Comedy OTT: ఓటీటీలోకి ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతోంది.
Romantic Comedy OTT: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వస్తోంది. ఒకప్పుడు రొమాంటిక్ కామెడీ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఉషా పరిణయం మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఈ సినిమాను ఈ వారమే ఈటీవీ విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
ఉషా పరిణయం ఓటీటీ రిలీజ్ డేట్
ఒకప్పుడు టాలీవుడ్ లో వెంకటేశ్, నాగార్జునలాంటి హీరోలతో బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ విజయ్ భాస్కర్. అతడు చాలా రోజుల తర్వాత మరోసారి ఉషా పరిణయం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తనయుడు శ్రీకమల్ హీరోగా ఉషా పరిణయం మూవీ తీశాడు. ఈ సినిమా ఈ గురువారం (నవంబర్ 14) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. సుమారు మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఇన్నాళ్లూ ఏ ఓటీటీ ఈ మూవీ డిజిటల్ హక్కులను తీసుకోలేదు. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన ఈ సినిమాను మొత్తానికి ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకుంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ తేదీని తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
"ఈ పరిచయం పరిణయం వరకా?.. పరిచయం వరకేనా? ఉషా పరిణయం నవంబర్ 14 నుంచి" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీకమల్ తోపాటు తన్వి ఆకాంక్ష, రవి శివ తేజ, సూర్య శ్రీనివాస్, సీరత్ కపూర్, అలీ, వెన్నెల కిశోర్, శివాజీ రాజా, ఆమనిలాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు.
ఉషా పరిణయం ఎలా ఉందంటే?
ఉషా పరిణయం మూవీని డైరెక్ట్ చేయడంతో పాటు కథను కూడా విజయ్ భాస్కరే అందించాడు. ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈ మూవీ ఉషా (తన్వి) అనే అమ్మాయి, హనీ అలియాస్ హనుమంతు (శ్రీకమల్) అనే అబ్బాయి మధ్య తిరిగే లవ్ స్టోరీ.
అయితే గతంలో వచ్చిన ఎన్నో సినిమాల స్టోరీలాగే అనిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. మరి అలాంటి ఉషా పరిణయం మూవీని ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.