OTT Psychological Thriller: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
OTT Psychological Thriller: ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చింది తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జగపతి బాబు, అనసూయ నటించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎక్కడ చూడాలంటే..
OTT Psychological Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ వచ్చింది. ఒకటి కాదు రెండు ఓటీటీల్లోకి ఒకే రోజు ఈ సినిమా రావడం విశేషం. ఈ మూవీ పేరు సింబా. జగపతి బాబు, అనసూయ లాంటి వాళ్లు నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నెల రోజుల్లోపే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సింబా ఓటీటీ స్ట్రీమింగ్
సింబా మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆహా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"ప్రకృతిని మనం కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది. అందుకే వస్తున్నాడు సింబా మన ఆహాలో.." అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది. అటు ప్రైమ్ వీడియోలోకీ ఈ సినిమా వచ్చింది. ఆగస్ట్ 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
సింబా మూవీ ఎలా ఉందంటే?
జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సింబా. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు సంపత్ నంది కథ, డైలాగ్స్ అందించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మెసేజ్‌కు బయోలాజికల్ మెమోరీ అనే సైంటిఫిక్ అంశాలను జోడించి దర్శకుడు సంపత్ నంది ఈ కథను రాశాడు. పాయింట్‌గా చూసుకుంటే సింబా ఓ సాధారణ రివేంజ్ స్టోరీనే.
కానీ ఈ కథను మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌పై నడిపించడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.సైన్స్, పర్యావరణం లాంటి రెండు భిన్నమైన అంశాలను రివేంజ్ స్టోరీలో మిక్స్ చేస్తూ కన్వీన్సింగ్‌గా చెప్పాడు.
ముందే ఊహించేలా..
సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్న ట్రీట్‌మెంట్ విషయంలో కొన్నిసార్లు రొటీన్‌గా అడుగులు వేశారు మేకర్స్. సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఎవరున్నారన్నది ఈజీగానే ఊహించేలా ఉండటం సినిమాకు మైనస్‌గా మారింది. జగపతిబాబు పాత్రకు సంబంధించిన సీన్స్, డైలాగ్‌లో ఎమోషన్స్ అంతగా పండలేదనిపిస్తుంది.
ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ రోల్ అంటూ ప్రచారం చేసింది సినిమా యూనిట్. కానీ ఆయన పాత్ర సెకండాఫ్‌లోనే సినిమాలో కనిపిస్తుంది. పర్యావరణ ప్రేమికుడిగా ఆయన చెప్పై డైలాగ్స్ పర్వాలేదనిపిస్తాయి.
అక్షికగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో అనసూయ కనిపించింది. వశిష్టసింహా, శ్రీనాథ్, దివితో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిధుల మేర నటించారు. గౌతమి, కస్తూరి వంటి సీనియర్ హీరోయిన్లు కనిపించేది కొద్ది సేపే అయినా వారి నటనానుభవం సినిమాకు హెల్పయింది.