Kerala Story OTT Streaming: 15 రోజులుగా ట్రెండింగ్‍లో టాప్.. మరో రికార్డుస్థాయి మైలురాయి దాటిన కేరళ స్టోరీ
The Kerala Story OTT Streaming: కేరళ స్టోరీ మూవీ ఓటీటీలో హవా కొనసాగిస్తోంది. అదా శర్మ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమా.. ట్రెండింగ్‍లో టాప్‍లో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో అరుదైన మైలురాయిని దాటింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
The Kerala Story OTT: అత్యంత వివాదాస్పదమైన ది కేరళ స్టోరీ సినిమా థియేటర్లలో ఎవరి ఊహలకు అందని విధంగా బ్లాక్‍బాస్టర్ అయింది. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా.. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళలో అమ్మాయిలను మోసగించి మతమార్పిడి చేశారన్న అంశంపై వచ్చిన ఈ సినిమా చాలా దుమారం రేపింది. గతేడాది మే 5వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, చాలా విరామం తర్వాత ఇటీవలే కేరళ స్టోరీ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.
థియేటర్లలో రిలీజైన సుమారు 9 నెలల తర్వాత ది కేరళ స్టోరీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఓటీటీలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. అంచనాలకు మించి వ్యూస్ దక్కించుకుంటోంది. 15 రోజులుగా జీ5 ఓటీటీలో నేషనల్ వైడ్‍లో కేరళ స్టోరీ టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో మైలురాయి దాటింది ఈ చిత్రం.
300 మిలియన్ మినిట్స్ క్రాస్..
జీ5 ఓటీటీలో కేరళ స్టోరీ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. 15 రోజులుగా ట్రెండింగ్ లిస్టులో నంబర్ వన్ ప్లేస్‍లో కొనసాగుతోంది. ఈ సినిమా తాజాగా 300 మిలియన్ల వాచ్ మినిట్స్ మైలురాయిని కూడా దాటేసింది. 15 రోజుల్లోనే ఈ చిత్రం ఈ ఫీట్ సాధించింది. ఈ సినిమా 300 మిలియన్లను అధిగమించిన విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (మార్చి 2) వెల్లడించింది.
ప్రేక్షకులు చాలా కాలం ఎదురుచూసిన కేరళ స్టోరీ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చింది. దీంతో ఈ మూవీకి అంచనాలకు మించి ఆదరణ దక్కుతోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా.. యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ కీలకపాత్రలు చేశారు. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విపుల్ అమృత్‍లాల్ షా నిర్మించారు. సుమారు రూ.20 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలన విజయం సాధించింది.
కేరళలోని అమ్మాయిలను మభ్యపెట్టి.. మతం మార్పిడి చేసి కొందరు ఉగ్రవాదంలోకి దింపుతున్నారన్న కథాంశంతో కేరళ స్టోరీ చిత్రాన్ని సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ దురాగతానికి బాధితులుగా మారిన ముగ్గురు అమ్మాయిల కథను ఈ చిత్రంలో చూపించారు. యథార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు.
కేరళ స్టోరీ చిత్రం విడుదలను ఆపాలని అప్పట్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అయితే, కోర్టు రిలీజ్‍కు అనుమతించింది. మరోవైపు, ఈ సినిమాకు కొన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇలా, దేశవ్యాప్తంగా కేరళ స్టోరీ చర్చనీయాంశం అయింది. అదే రేంజ్‍లో భారీ వసూళ్లను సాధించింది.