OTT Controversial Movie: ఏడు నెలల తర్వాత మళ్లీ ఓటీటీలోకి వస్తున్న నయనతార వివాదాస్పద మూవీ.. కానీ చిన్న ట్విస్ట్
OTT Controversial Movie: నయనతార వివాదాస్పద మూవీ ఏడు నెలల తర్వాత మళ్లీ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అయితే ఈసారి ఇండియాలో కాకుండా కేవలం విదేశాల్లో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
OTT Controversial Movie: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన వివాదాస్పద మూవీ అన్నపూర్ణి. ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో యానిమల్ మూవీ రిలీజైన సమయంలోనే థియేటర్లలోకి వచ్చింది. తర్వాత నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్, సింప్లీ సౌత్ లాంటి ఓటీటీల్లో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ సబ్జెక్ట్ వివాదాస్పదం కావడంతో విశ్వ హిందూ పరిషత్ దీనిపై అభ్యంతరం చెప్పింది. దీంతో మూవీని ఓటీటీల్లో నుంచి తొలగించారు.
మళ్లీ ఓటీటీలోకి అన్నపూర్ణి
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ ఈ ఏడాది జనవరిలో అన్నపూర్ణి మూవీని ఓటీటీల్లో నుంచి తొలగించారు. అయితే ఏడు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొస్తున్నారు. ఈ శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి అన్నపూర్ణి మూవీని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. అయితే ఈ సినిమా ఇండియాలో కాకుండా కేవలం విదేశాల్లో మాత్రమే అందుబాటులోకి రానుంది.
నయనతార కెరీర్లో ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా రిలీజైన ఈ అన్నపూర్ణి ఆగస్ట్ 9 నుంచి ఇండియాలో తప్ప ప్రపంచవ్యాప్తంగా మరోసారి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని సింప్లీ సౌత్ ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. ఇండియాలో మూవీ మళ్లీ అందుబాటులోకి వస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
ఏంటీ అన్నపూర్ణి వివాదం?
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సమయం నుంచే వివాదాలు మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత నెల రోజులకు అంటే డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అన్నపూర్ణి సినిమాను స్ట్రీమింగ్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి చూసిన ప్రేక్షకులు అన్నపూర్ణి సినిమాపై అభ్యంతరం తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్సు ఉన్నాయంటూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ, నిర్మాతలు, జీ స్టూడియో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాకిడికి తట్టుకోలేక నెట్ ఫ్లిక్స్ సంస్థ తన వేదిక నుంచి అన్నపూర్ణి సినిమాను తొలగించింది.
నయనతార క్షమాపణ
దీనిపై గతంలో నయనతార కూడా స్పందించి క్షమాపణ చెప్పింది. "నా టీమ్ గానీ, నేను కానీ ఎవరి సెంటిమెంట్‌ను కావాలని బాధపెట్టాలని అనుకోలేదు. జరిగిన సంఘటన తాలుకు లోతు ఎంతో ఉందని మాకు అర్థం అవుతోంది.దేవుడిని బలంగా నమ్మి దేశవ్యాప్తంగా ఆలయాలకు తిరిగే వ్యక్తిగా నేను ఇలాంటి పని కావాలని ఎప్పుడూ చేయను.
ఎవరి ఫీలింగ్స్ అయితే హర్ట్ అయ్యాయో వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. స్ఫూర్తిని ఇవ్వాలన్నదే అన్నపూర్ణి లక్ష్యం. బాధపెట్టాలని కాదు" అని నయనతార సారీ చెప్పింది.
అన్నపూర్ణి ఎలా ఉందంటే?
చెఫ్ వృత్తిని వంట పని అంటూ చాలా మంది చులకనగా చూస్తుంటారు. కానీ ఐఏఎస్, ఐపీఎస్ లాగే చెఫ్ అన్నది కూడా ఓ గౌరవప్రదమైన వృత్తి అన్ని అన్నపూర్ణి సినిమాలో చూపించాడు డైరెక్టర్ నీలేష్ కృష్ణ. వంట చేయడం కూడా ఓ ఆర్ట్ అని చాటిచెప్పాడు. బ్రాహ్మణ అమ్మాయి చెఫ్‌గా ఎలా మారింది?
ఈ ప్రయాణంలో ఆమె ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నదన్నదే అన్నపూర్ణి మూవీ కథ. బ్రాహ్మణులు నాన్ వెజ్ వండటం, తినడం అన్నది చాలా సెన్సిటివ్ పాయింట్. ఈ అంశమే వివాదమై ఆ సినిమా ఓటీటీల్లో నుంచి వెళ్లిపోవడానికి కారణమైంది.