OTT Mystery Thriller Web Series: ఓటీటీలో దుమ్ము రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఇంకా చూశారా లేదా?
OTT Mystery Thriller Web Series: ఓటీటీలో ఇప్పుడో మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మరో అరుదైన మైలురాయి అందుకుంది. మరి ఈ సిరీస్ మీరు ఇంకా చూశారా లేదా?
OTT Mystery Thriller Web Series: మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ఓటీటీలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ఆ జానర్లో వచ్చిన మరో వెబ్ సిరీస్ నిరూపిస్తోంది. ఈ సిరీస్ పేరు ఖోజ్: పర్చాయియోంకే ఉస్ పార్. జీ5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. గత నెలలో ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా వాచ్ మినట్స్ లో మరో మైలురాయిని అందుకుంది.

ఖోజ్ వెబ్ సిరీస్ రికార్డు
జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఖోజ్: పర్చాయియోంకే ఉస్ పార్ వెబ్ సిరీస్ 150 మిలియన్ వాచ్ మినట్స్ నమోదు చేసినట్లు ఆ ఓటీటీ మంగళవారం (జనవరి 21) వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తొలి రోజు నుంచే ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వ్యూస్ విషయంలో దూసుకెళ్తోంది. ఏకంగా 150 మిలియన్ ప్లస్ వాచ్ మినట్స్ నమోదు చేయడం అంటే మాటలు కాదు.
ఖోజ్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి?
కథలో ట్విస్టులతో, ఊహకందని క్లైమ్యాక్స్ లతో థ్రిల్లర్ స్టోరీలు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమాలైనా, వెబ్ సిరీస్ అయినా థ్రిల్లర్ జానర్ కు ఆడియెన్స్ ప్రత్యేకంగా ఉంటారు. అలా వచ్చిన వెబ్ సిరీసే ఖోజ్: పర్చాయోంకే ఉస్ పార్. ఈ సిరీస్ లో షరీబ్ హష్మి, అనుప్రియా గోయెంకా, ఆమిర్ దల్విలాంటి వాళ్లు నటించారు. ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రబల్ బారువా ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. మొత్తం ఏడు ఎపిసోడ్ల సిరీస్ ఇది. ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్లో ఏం జరగబోతోందో అన్న సస్పెన్స్ తో ముగించారు.
తన భార్య మీరా తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తాడు వేద్ అనే ఓ హైకోర్టు లాయర్. ఈ కేసు విచారణను చేపట్టిన పోలీస్ ఆఫీసర్ కు పలు సందేహాలు వస్తుంటాయి. వాటి గుట్టును తేల్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే మరుసటి రోజే అతని భార్య దొరికిందంటూ ఆమెను అతని ఇంటికే తీసుకెళ్లి అప్పగిస్తాడు. ఆమె తన భార్య కాదంటూ అతడు వాదిస్తాడు.
అయితే ఇంట్లో అతడు చూపించిన సాక్ష్యాలన్నీ వేద్ కు వ్యతిరేకంగానే ఉంటాయి. తన కన్న కూతురు కూడా ఆమెనే అమ్మా అని పిలుస్తుంది. ఆ పోలీస్ అధికారి తీసుకొచ్చిన వ్యక్తే మీరా అని నమ్మలేకపోతాడు వేద్. ఆమె తన భార్య కాదని నిరూపించడానికి చాలా ప్రయత్నాలే చేస్తాడు. కానీ ఈ క్రమంలో తనకే మానసిక ఆరోగ్యం సరిగా లేదని, రెండేళ్లుగా చికిత్స పొందుతున్నాడని వేద్ నే నమ్మించే ప్రయత్నం చేస్తుంది ఆ వ్యక్తి.
చివరికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను కూడా ఆ నకిలీ మీరా గురించి ఆరా తీయడానికి వేద్ ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తి గురించి అతనికి కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తుంటాయి. తాను అతని భార్యనే అంటూ వేద్ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? చివరికి అతని భార్య దొరుకుతుందా? క్లైమ్యాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి అన్నది ఈ ఖోజ్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.
సంబంధిత కథనం