OTT Thriller Movies: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన ఈ రెండు థ్రిల్లర్ మూవీస్ అస్సలు మిస్ కావద్దు.. ఊహకందని ట్విస్టులు, థ్రిల్
OTT Thriller Movies: ఓటీటీలోకి ఈ మధ్యే రెండు థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. అందులో ఒకటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మలయాళం మూవీ కాగా.. మరొకటి సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళ సినిమా. వీటిని అస్సలు మిస్ కాకుండా చూడాల్సిందే.

OTT Thriller Movies: థ్రిల్లర్ జానర్ అంటే ఇష్టమా? ఓటీటీలో ఈ జానర్లో ఏ సినిమా వచ్చినా వదలకుండా చూస్తారా? అయితే ఈ రెండు మూవీస్ మీకోసమే. వీటిలో ఒకటి మలయాళం కాగా.. మరొకటి తమిళం సినిమా. ఈ రెండూ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. టొవినో థామస్ నటించిన ఐడెంటిటీ, జీవా నటించిన డార్క్ (తమిళంలో బ్లాక్) మూవీస్ మంచి థ్రిల్ పంచుతున్నాయి.
ఓటీటీ మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీస్
ఓటీటీలోకి తరచూ థ్రిల్లర్ జానర్లో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అలా ఈ మధ్యే రెండు వేర్వేరు ఓటీటీల్లోకి ఈ ఐడెంటిటీ, డార్క్ మూవీస్ వచ్చాయి. అసలు ఊహకందని ట్విస్టులతో సాగే ఈ మూవీస్ మంచి థ్రిల్ పంచుతాయి. మరి ఈ సినిమాను ఎందుకు, ఎక్కడ చూడాలన్న విషయాలు ఇక్కడ చూడండి.
డార్క్ - ప్రైమ్ వీడియో
తమిళ నటుడు జీవా, ప్రియా భవానీ శంకర్ నటించిన మూవీ ఇది. తమిళంలో బ్లాక్ పేరుతో గతేడాది అక్టోబర్లో రిలీజైంది. తెలుగులో మాత్రం నేరుగా ప్రైమ్ వీడియోలోకే వచ్చేసింది. డార్క్ ఒక సైన్స్ ఫిక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. క్వాంటమ్ ఫిజిక్స్, బ్లాక్ హోల్, వేర్వేరు రియాల్టీలు.. ఇలా వీటిపై ఆసక్తి ఉన్న వారికి ఈ డార్క్ మూవీ తెగ నచ్చేస్తుంది.
అసలు ఊహకందకుండా సాగే కథనంతో మొదటి నుంచి చివరి వరకూ డార్క్ మూవీ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఈ సినిమా మొత్తం వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) చుట్టూనే తిరుగుతుంది. కేజీ బాలసుబ్రమణి డైరెక్ట్ చేశాడు. మొదట్లో సాదాసీదాగానే ప్రారంభమయ్యే ఈ సినిమా.. స్టోరీ గడుస్తున్న కొద్దీ ఆసక్తి రేపుతుంది. ఈ జంట ప్రైవసీ కోసం సిటీకి దూరంగా ఉండే ఓ విల్లాకి వెళ్తుంది. ఆ కమ్యూనిటీలో వీళ్లు తప్ప మరెవరూ ఉండరు.
అక్కడికి వెళ్లిన తర్వాత ఈ జంటకు వింత అనుభవాలు ఎదురవుతాయి. వాళ్లకు అలా ఎందుకు జరిగింది? చివరికి వాళ్లు అక్కడి నుంచి క్షేమంగా బయటపడతారా లేదా అన్నదే ఈ డార్క్ మూవీ కథ. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేసింది. మంచి థ్రిల్ కావాలంటే ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ డార్క్ అస్సలు మిస్ కావద్దు.
ఐడెంటిటీ - జీ5 ఓటీటీ
మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఇప్పుడు మంచి థ్రిల్ అందిస్తోంది. టొవినో థామస్, త్రిషలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా.. మొదట్లో షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలన్న కాన్సెప్ట్ తోనే మొదలవుతుంది.
కానీ ఆ తర్వాతే కథలో వచ్చే మలుపులు అసలు ఊహకందని విధంగా ఉంటాయి. ఈ సినిమాలో త్రిష ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించగా.. టొవినో థామస్ ఓ స్కై మార్షల్ పాత్ర పోషించాడు. ఐడెంటిటీ మూవీ ఈ ఏడాది మలయాళంలో హిట్ కొట్టిన తొలి సినిమా. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
పైన చెప్పిన రెండు సినిమాలూ మీ కళ్లతో చూడటమే కాదు.. మీ మెదడుకు కూడా పని పెట్టేలా చేస్తాయి. ఒక దశలో అసలు ఏం జరుగుతుందో, కథ ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాని అయోమయానికి గురి చేస్తాయి. అందుకే వీటిని ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బన్స్ లేని సమయంలో చూస్తేనే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.
సంబంధిత కథనం