Aavesham OTT Controversy: ప్రేక్షకులను బాధపెట్టిన ఓటీటీ మూవీ ఆవేశం.. భాషను అవమానించారంటూ ఫైర్
Aavesham OTT Dialogue Controversy In Hindi: ఇటీవల ఓటీటీలోకి వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆవేశం సినిమా కాంట్రవర్సీకి పాలైంది. సినిమాలో హిందీపై ఫహాద్ ఫాజిల్ కొట్టిన ఓ డైలాగ్ వివాదానికి దారి తీసింది. దాంతో భాషను అవమానించారంటూ నార్త్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.
Aavesham OTT Dialogue Controversy: మలయాళ వర్సటైల్ యాక్టర్, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆవేశం. ఏప్రిల్ 11న మలయాళంలో విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కామెడీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము దులిపింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 150.6 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.
2 రోజుల ముందుగానే
అలా మలయాళ చిత్రపరిశ్రమలో (Malayalam Industry) అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెలకంటే రెండు రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime OTT) మే 9 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది ఆవేశం సినిమా.
హిందీ భాషపై డైలాగ్
ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ఆవేశం సినిమా ఇప్పుడు కాంట్రవర్సీ (Aavesham Controversy) ఎదుర్కొంటుంది. అందుకు కారణం సినిమాలోని ఓ డైలాగే. ఆ డైలాగ్ హిందీ భాషపై (Hindi Language) ఉండటం. హిందీ భాషను అవమానించారంటూ నార్త్ ప్రేక్షకులు సినిమా టీమ్‌పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్
ఆవేశం సినిమాలో రంగ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ (FAFA) నటించాడు. ఈ చిత్రం అంతా అజు, బిబి, శాంతన్ అనే ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్, వాళ్లకు రంగ అనే గ్యాంగ్‌స్టర్ ఎలా హెల్ప్ చేశాడు అనే అంశాల చుట్టూ తిరుగుతుంటుంది. అయితే, ఈ క్రమంలోనే వచ్చే ఓ సన్నివేశంపై హిందీ ప్రజలు గుస్సా అవుతున్నారు.
మలయాళంలో వార్నింగ్
ఈ ముగ్గురి కాలేజ్ స్టూడెంట్స్ కోసం వాళ్ల సీనియర్‌ను కొట్టేందుకు కాలేజ్‌కు వస్తాడు రంగ. తనతోపాటు అతని రైట్ హ్యాండ్ అంబాన్ కూడా ఉంటాడు. సీనియర్స్‌ను బాగా చితకబాదిన తర్వాత అజు, బిబి, శాంతన్ తన మనుషులు అని, వారిపై ఎవరూ చేయి వేయకూడదని మలయాళంలో రంగ వార్నింగ్ ఇస్తాడు. అయితే మూవీ జరిగేది బెంగళూరులో కాబట్టి కన్నడ భాషలో కూడా రంగ వార్నింగ్ ఇస్తాడు.
హిందీలో అవసరం లేదు
అలాగే హిందీ భాషలో కూడా రంగ వార్నింగ్ ఇద్దామనుకునే సమయానికి "హిందీలో అవసరం లేదు" అని రంగను తన రైట్ హ్యాండ్ అంబాన్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు ఇదే సీన్, ఇదే డైలాగ్ నెట్టింట్లో కాంట్రవర్సీ అవుతూ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. అలాగే దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చులకనగా చూడటం
హిందీని అవసరం లేదు అన్నట్లుగా చులకనగా అనడం కరెక్ట్ కాదని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం హిందీ నేషనల్ భాష కాదంటూ చిన్న విషయాన్ని పెద్దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అది సినిమాలో ఒక డైలాగ్ మాత్రమే కదా వదిలేయమని మరికొందరు అంటున్నారు. అయితే, దీనిపై హిందీ ప్రేక్షకులు మాత్రం చాలా హర్ట్ అయినట్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మలయాళంలో స్ట్రీమింగ్
మరి ఈ డైలాగ్ కాంట్రవర్సీ ఎక్కడివరకు తీసుకెళ్తుందో చూడాలి. కాగా ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆవేశం సినిమా మలయాళ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ్ వంటి దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో చూడాలి.