OTT Malayalam Horror Web Series: ఓటీటీలోకి వస్తున్న మలయాళం హారర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam Horror Web Series: ఓటీటీలోకి సరికొత్త మలయాళం హారర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అయితే స్ట్రీమింగ్ డేట్ ఇంకా వెల్లడించకపోయినా.. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
OTT Malayalam Horror Web Series: మలయాళం నుంచి ఇప్పుడో కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. అది కూడా హారర్ జానర్ లో కావడం విశేషం. ఈ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ బుధవారం (ఆగస్ట్ 14) రాత్రి వెల్లడించారు. ఈ సిరీస్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.
మలయాళం హారర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్
మలయాళం ఇండస్ట్రీ నుంచి ఇప్పడిప్పుడే మంచి వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. తాజాగా అక్కడి నుంచి ఓ హారర్ వెబ్ సిరీస్ 1000 బేబీస్ పేరుతో రాబోతోంది. రెహమాన్, నీనా గుప్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ రానుంది.
తాజా అప్డేట్ వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇదొక హారర్ డ్రామాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ లో ఓ అడవిలో చెట్ల మధ్య ఉన్న ఉయ్యాలలు, ఓ పాపను చూడొచ్చు. ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ లో సంజూ శివరామ్, ఆదిల్, జాయ్ మాథ్యూ, శ్రీకాంత్ మురళీ, అశ్విన్ కుమార్, ఇర్షాద్ అలీ కూడా నటించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగుతోపాటు ఇతర సౌత్ ఇండియా భాషల్లో వెబ్ సిరీస్ తీసుకొస్తున్న హాట్‌స్టార్.. ఇప్పుడీ 1000 బేబీస్ తో రానుంది.
హాట్‌స్టార్‌లోని మలయాళం వెబ్ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మలయాళం కంటెంట్ కూడా ఎక్కువే. నిజానికి ఆ భాష నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ కూడా గతేడాది ఈ ప్లాట్‌ఫామ్ లోకే వచ్చింది. ఇక ఈ ఏడాది ఇప్పటికే పెరల్లూర్ ప్రీమియర్ లీగ్, నాగేంద్రన్స్ హనీమూన్స్ లాంటి వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు ఈ 1000 బేబీస్ తో హారర్ జానర్ మలయాళం వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. మలయాళంతోపాటు మరో ఐదు భాషల్లోనూ ఈ సిరీస్ రూపొందుతుండటంతో దేశవ్యాప్తంగా దీనికి మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.
1000 బేబీస్ సిరీస్ గురించి..
ఈ 1000 బేబీస్ సిరీస్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, పలు సీజన్ల పాటు వస్తూనే ఉంటుందని సిరీస్ నిర్మాత ఆగస్ట్ సినిమాకు చెందిన షాజీ నటేషన్ అన్నాడు. ఈ సిరీస్ ను నజీమ్ కోయా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ మొత్తంగా 210 నిమిషాల పాటు ఉంటుందని కూడా షాజీ వెల్లడించాడు. అంటే మూడున్నర గంటలు. గతేడాది ఈ సిరీస్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. అంతేకాదు సిరీస్ ను ఏకంగా 93 లొకేషన్లలో చిత్రీకరించడం విశేషం. హాట్‌స్టార్ లో సౌత్ నుంచి వస్తున్న అతిపెద్ద వెబ్ సిరీస్ లలో ఇదీ ఒకటని కూడా నిర్మాత షాజీ చెప్పాడు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీ త్వరలోనే వెల్లడి కానుంది.