OTT Malayalam Action Thriller: ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Malayalam Action Thriller: మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టర్బో చెప్పిన దాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి రావడం విశేషం. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Malayalam Action Thriller: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ టర్బో. ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర రూ.70 కోట్ల వరకూ వసూలు చేసింది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజానికి శుక్రవారం (ఆగస్ట్ 9) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అనౌన్స్ చేసినా.. ఒక రోజు ముందుగానే వచ్చేసింది.
టర్బో ఓటీటీ స్ట్రీమింగ్
మమ్ముట్టి నటించిన ఈ టర్బో మూవీ ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. తాము అనౌన్స్ చేసినదాని కంటే ఒక రోజు ముందే సినిమాను స్ట్రీమింగ్ చేసిన ఈ ఓటీటీ ఆశ్చర్యపరిచింది. గతంలో పులిమురుగన్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన వైశాఖ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ రివ్యూలు రాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఊహించినన్ని వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో రాజ్ బీ శెట్టి విలన్ గా నటించాడు. తెలుగు కమెడియన్ సునీల్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. మమ్ముట్టి ఇందులో నటించడమే కాకుండా తన సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ కింద మూవీని నిర్మించాడు.
టర్బో ఎలా ఉందంటే?
ఓ ప్రేమ జంటకు సహాయం చేసే ఓ సాధారణ జీప్ డ్రైవర్ కథ ఇది. అనుకోకుండా పెద్ద బ్యాంక్ స్కామ్‌ను బయటపెట్టి చిక్కుల్లో పడ్డ ప్రేమ జంటను హీరో ఎలా కాపాడాడు? అన్నదే ఈ సినిమా కథ. ఈ సింపుల్ స్టోరీని రేసీ స్క్రీన్‌ప్లేతో నడిపించేలా సీన్స్ రాసుకుంటే బాగుండేది.
కానీ ఆ విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. అసలు కథలోకి వెళ్లడానికే దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. ప్రేమ జంట లవ్ స్టోరీ టీవీ సీరియల్ ఎపిసోడ్‌ను తలపిస్తుంది. హీరో...విలన్ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులలో క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రమే వర్కవుట్ అయ్యింది. . బలమైన కథ లేకపోవడం, కథనం కూడా ల్యాగ్ కావడంతో సినిమా నీరసంగా సాగుతుంది.
మమ్ముట్టి సినిమా అంటే కథ, క్యారెక్టర్స్ పరంగా కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. కానీ టర్బో మూవీలో ఆ కొత్తదనం ఛాయలు మచ్చుకు కూడా కనిపించవు. మమ్ముట్టి మాస్ సినిమా చేసి చాలా కాలమైంది. ఫక్తు కమర్షియల్ మాస్ క్యారెక్టర్‌లో తనను తాను చూడాలనే కోరికతో కథ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మమ్ముట్టి టర్బో మూవీని చేసిన ఫీలింగ్ కలుగుతుంది.