OTT Horror Thriller: ఓటీటీలోకి వచ్చేసిన వణుకుపుట్టించే హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్‌స్పెక్టర్ రిషి .. ఎక్కడ చూడొచ్చంటే?
Inspector Rishi OTT Streaming Now: హారర్ థ్రిల్లర్ సినిమాలకు, సిరీసులకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ఏ భాషలో వచ్చేసిన ప్రేక్షకులు చూసేస్తారు. అలాంటింది తాజాగా ఓటీటీలోకి సరికొత్త తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి వచ్చేసింది. మరి దీన్ని ఎక్కడ చూడాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Inspector Rishi OTT Release: ఎన్నో ఏళ్లుగా హీరోగా అలరిస్తున్నాడు నవీన్ చంద్ర. సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి ఫస్ట్ మూవీ అందాల రాక్షసితో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనంతరం హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ పాత్రల్లో అలరిస్తూ వస్తున్నాడు. అయితే, అవేవి ఆయనకు పెద్ద బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పటీకీ అందాల రాక్షసి సినిమానే నవీన్ చంద్ర కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.
ఓటీటీ సినిమాలతో
గతేడాది కలర్స్ స్వాతితో కలిసి చేసిన మంత్ ఆఫ్ మధు కూడా బాగానే ఆకట్టుకుంది. ఇది థియేట్రికల్‌గా బాగానే అనిపించుకున్న దానికంటే ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే, థియేట్రికల్ రిలీజ్ సినిమాలకంటే ఓటీటీ కంటెంట్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు నవీన్ చంద్ర. అమ్ము, రిపీట్ సినిమాలతోపాటు పరంపర వెబ్ సిరీస్‌తో ఎంతగానో అలరించాడు. అమ్ములో గ్రే షేడ్స్ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్‌గా వచ్చిన రిపీట్‌లో నటనతో అలరించాడు.
హారర్ థ్రిల్లర్‌కు క్రైమ్
ఇక పరంపర సిరీస్ నవీన్ చంద్రకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ రెండు సీజన్స్‌తో పరంపర నవీన్ చంద్ర కెరీర్‌లో మంచి సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు దానికంటే కొత్తగా, విభిన్నంగా, బాగా గుర్తుండిపోయేటువంటి సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ చంద్ర. సాధారణంగా హారర్ థ్రిల్లర్స్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. అలాంటింది హారర్ థ్రిల్లర్‌కు క్రైమ్ యాడ్ చేసి ఫుల్ సస్పెన్స్‌తో తెరకెక్కిస్తే.. ఇక సినీ ప్రియులకు పండగే.
10 ఎపిసోడ్స్-5 భాషలు
అలా హారర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఓటీటీలోకి వచ్చేసింది ఇన్‌స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 29 (శుక్రవారం) అంటే నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది ఇన్‌స్పెక్టర్ రిషి. దాదాపుగా 35 నుంచి 60 నిమిషాల నిడివితో పది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ చాలానే భయపెట్టింది. మనుషులకు గూడు పెట్టే ఓ రాకాసి దెయ్యం కథ నేపథ్యంతో సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది.
సూపర్ నాచురల్ థ్రిల్లర్
ఈ హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషిలో నవీన్ చంద్రతోపాటు సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ క్రైమ్, సూపర్ నాచురల్ కథతో రూపొందొంచిన ఈ సిరీస్‌కు డైరెక్టర్ నందిని జె.ఎస్ దర్శకత్వం వహించారు. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్‌పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
వరుసగా హత్యలు
ఇదిలా ఉంటే, ఇన్‌స్పెక్టర్ రిషి ట్రైలర్ చూస్తే.. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. జంతువుల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తిరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని ఊరి జనం చెబుతుంటారు. ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. ఈ హత్యలకు కారణాలు తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్తగా వస్తాడు ఇన్‌స్పెక్టర్ రిషి.
దెయ్యమే కారణమా?
ఊరి జనం మాటలు నమ్మని రిషి సైంటిఫిక్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో రిషి అతని పోలీస్ టీమ్ షాక్ అయ్యే విషయాలు తెలుస్తుంటాయి. తీన్ కాడు ప్రాంత వరుస హత్యలకు దెయ్యమే కారణమైతే అందుకు పరిష్కారాన్ని ఇన్స్ పెక్టర్ రిషి ఎలా కనుక్కున్నాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
టాపిక్