OTT Horror Comedy: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. 150 కోట్ల బడ్జెట్ 400 కోట్ల వసూళ్లు
OTT Horror Comedy: ఓటీటీలోకి ఈ ఏడాది లాస్ట్ వీకెండ్ లో ఓ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది.
OTT Horror Comedy: హారర్ కామెడీ జానర్లో 2024లో వచ్చిన చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. ఈ జానర్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీయే భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లు నటించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అంటే శుక్రవారం (డిసెంబర్ 27) ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.
భూల్ భులయ్యా 3 ఓటీటీ రిలీజ్ డేట్
సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి వచ్చిన మూడో సినిమా ఈ భూల్ భులయ్యా 3. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ హారర్ కామెడీ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని కొన్నాళ్ల కిందటే అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా గురువారం (డిసెంబర్ 26) మరో వీడియో రిలీజ్ చేసింది. ఇందులో సినిమాలో రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్ ఫన్నీ అవతార్ చూడొచ్చు.
అతని ముందు కొన్ని వస్తువులు ఉంటాయి. అన్నీ శాపగ్రస్తమైనవే అంటూ వాటిని చూసి పడేస్తుంటాడతడు. చివరికి ఓ ప్లేట్ ను కూడా అలాగే అనడంతో సడెన్ గా అది కదులుతూ అతన్ని భయపెడుతుంది. అందులో నెట్‌ఫ్లిక్స్ అనే అక్షరాలు కనిపిస్తాయి. తర్వాత మంజూలిక వస్తున్న గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కాస్త ఫన్నీగా అనౌన్స్ చేసే ప్రయత్నం చేసింది.
నెగటివ్ రివ్యూస్.. అయినా బాక్సాఫీస్ హిట్
భూల్ భులయ్యా ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో మూవీకి నెగటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాను చూసిన ప్రేక్షకులకు కూడా అసలు నచ్చలేదు. ఐఎండీబీలోనూ కేవలం 5.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. రూ.150 కోట్ల బడ్జెట్ తో మూవీని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.417 కోట్లు రావడం విశేషం.
కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి డిమ్రిలాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. అనీస్ బజ్మీ సినిమాను డైరెక్ట్ చేశాడు. హారర్ తోపాటు కామెడీ కూడా పంచిన ఈ సినిమా మ్యూజికల్ గా మాత్రం సక్సెసైంది. ముఖ్యంగా ఇందులోని మేరే డోల్నా సాంగ్ సూపర్ హిట్ అయింది. ఒకవేళ భూల్ భులయ్యా 3ని థియేటర్లలో చూసి ఉండకపోతే శుక్రవారం (డిసెంబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూసేయండి.