OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2.. అదిరిపోయిన టీజర్
OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా శుక్రవారం (జనవరి 3) మేకర్స్ ఓ చిన్న టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఈ సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచేసింది.
OTT Crime Thriller Web Series: ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన టాప్ వెబ్ సిరీస్ లలో ఒకటి పాతాళ్ లోక్ (Paatal Lok). 2020, మే నెలలో వచ్చిన తొలి సీజన్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలోనూ 8.1 రేటింగ్ నమోదైంది. మొత్తానికి సుమారు నాలుగున్నర నెలల తర్వాత రెండో సీజన్ రాబోతోంది. శుక్రవారం (జనవరి 3) ఈ కొత్త సీజన్ కు సంబంధించిన చిన్న టీజర్ ను మేకర్స రిలీజ్ చేశారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పాతాళ్ లోక్ సీజన్ 2 టీజర్
పాతాళ్ లోక్ సీజన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ తేదీని చాలా రోజుల కిందటే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ మొత్తం సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన జైదీప్ అహ్లావతే కనిపిస్తాడు. ఓ లిఫ్ట్ లో ఉన్న అతడు రెండో సీజన్ స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక్క పురుగును చంపి హీరోగా ఫీలైతే ఎలా.. పాతాళ్ లోక్ లో లక్షల సంఖ్యలో ఉన్న మిగిలిన పురుగుల సంగతేంటి అని ఈ టీజర్లో అతడు ప్రశ్నిస్తాడు.
దీనిని బట్టి రెండో సీజన్ లో పోలీస్ ఆఫీసర్ హథీరాం చౌదరి (జైదీప్ అహ్లావత్) పాతాళ్ లోక్ లోని కొత్త కేసుపై దృష్టి సారించబోతున్నట్లు స్పష్టమవుతోంది. సుమారు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఎంతగానో ఆసక్తి రేపుతోంది. టీజర్ మొదట్లోనే జైదీప్.. ఓ లిఫ్ట్ ఎక్కుతాడు. ఓ కథ చెప్పాలా అని అడుగుతాడు. ఓ ఊళ్లో ఓ వ్యక్తి ఉంటాడు.. అతనికి పురుగులంటే అసహ్యం. ప్రపంచంలోనే అన్ని జాడ్యాలకు అవే కారణమని అతడు నమ్ముతాడు.. ఒకరోజు అతని ఇంట్లోనే మూలకు ఓ పురుగు కనిపించింది.
అది అందరినీ కుట్టింది. కానీ అతడు ఎలాగోలా దానిని చంపేశాడు. రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. కానీ అంతటితో కథ ముగియలేదు.. కొన్ని వందల, వేల, లక్షల పురుగులు పుట్టుకొచ్చాయి.. పాతాళ్ లోక్ అంటే ఒక్క పురుగే ఉంటుందా అంటూ అతడు చెబుతూ వెళ్లాడు.
పాతాళ్ లోక్ సీజన్ 1లో ఏం జరిగిందంటే?
పాతాళ్ లోక్ సీజన్ 1 హథీరాం చౌదరి (జైదీప్ అహ్లావత్) అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. అతనికి ఓ జర్నలిస్ట్ పై జరిగిన హత్యాయత్నం కేసు ఇస్తారు. దాని మూలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన అతడు మరో ప్రపంచంలోకి వెళ్తాడు. అదే పాతాళ్ లోక్. అక్కడి క్రైమ్ బయటి ప్రపంచంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందన్న నిజం అతనికి తెలుస్తుంది.
ఢిల్లీలోని తూర్పు ఢిల్లీలో జరిగిన కథగా దీనిని తెరకెక్కించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచీ రెండో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి పాతాళ్ లోక్ 2 జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది.