OTT Action Thriller: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న రూ.500 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Action Thriller: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఓ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనూ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
OTT Action Thriller: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.. సింపుల్ గా ది గోట్ మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా మూవీని స్ట్రీమింగ్ చేయనున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఓ స్పెషల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.500 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించి విజయ్ కెరీర్లో మరో హిట్ గా నిలిచిందీ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్.
ది గోట్ ఓటీటీ రిలీజ్ డేట్
దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టడానికి ముందు చేసిన మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా.. భారీ వసూళ్లతో ఫర్వాలేదనిపించింది. ది గోట్ మూవీ ఇప్పుడు గురువారం (అక్టోబర్ 3) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
నెల రోజుల్లోపే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే సినిమా రానుండటంతో నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. "మంచి వర్సెస్ చెడు, పాత వర్సెస్ కొత్త, దళపతి వర్సెస్ ఇళయదళపతి.. దళపతి విజయ్ నటించిన ది గోట్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నెట్‌ఫ్లిక్స్ లోకి అక్టోబర్ 3న తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీల్లో రానుంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ మూవీ డిజిటల్ ప్రీమియర్ విషయాన్ని తెలిపింది.
ది గోట్ ఎలా ఉందంటే?
దళపతి విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పై రిలీజ్ కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఆశించిన మేర ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పక్కా విజయ్ మార్క్ కమర్షియల్ మూవీ ఇది. అతని నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ మూవీలో ఉండేలా డైరెక్టర్ వెంకట్ ప్రభు చూసుకున్నాడు.
అందుకే కథ విషయంలో పెద్దగా ప్రయోగాలకు వెళ్లకుండా.. విజయ్ నే నమ్ముకొని మూవీ తీసినట్లుగా అనిపిస్తుంది. తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు.. వీరిద్దరి పోరాటంలో గెలుపు ఎవరిది అన్నదే ది గోట్ మూవీ కథ. ఈ సింపుల్ స్టోరీని మూడు గంటల నిడివితో చెప్పడానికి వెంకట్ ప్రభు అన్ని అస్త్రాలు వాడాడు. జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేశాడు. అందులో కొన్ని వర్కవుట్ అయితే కొన్ని బెడిసికొట్టాయి.
స్టేడియం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే క్లైమాక్స్ ఫైట్ ఐడియా బాగుంది. ఓ పక్క ధోనీ బ్యాటింగ్, మరో పక్క విజయ్ ఫైటింగ్.. శివకార్తికేయన్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయి. గాంధీ, జీవన్ రెండు పాత్రల్లో దళపతి విజయ్ వేరియేషన్ చూపించిన విధానం, యాక్టింగ్ బాగున్నాయి. డ్యాన్సుల్లో అదరగొట్టాడు. మొత్తం విజయ్ చుట్టూనే తిరిగే ఈ మూవీ అతని అభిమానులను తప్ప మిగిలిన ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.