OTT Action Thriller: ఓటీటీలోకి నేరుగా వస్తున్న రూ.400 కోట్ల బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Action Thriller: ఓటీటీలోకి ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా వస్తుండటం విశేషం. ఈ హాలీవుడ్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
OTT Action Thriller: ఓటీటీల్లోకి కొన్ని చిన్న సినిమాలు నేరుగా అడుగుపెడుతుండటం చూస్తూనే ఉన్నాం. కానీ ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా పేరు క్యారీ-ఆన్. ఈ ఇంగ్లిష్ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళంలాంటి భారతీయ భాషల్లోనూ రాబోతోంది.
క్యారీ-ఆన్ ఓటీటీ రిలీజ్ డేట్
ఇంగ్లిష్ మూవీ క్యారీ-ఆన్ డిసెంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (నవంబర్ 15) వెల్లడించింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. "ప్రతి హాలీడే సీజన్ లో కోట్లాది మంది విమానాల ద్వారా సురక్షితంగా ప్రయాణిస్తారు.
కానీ ఈ క్రిస్మస్ మాత్రం భిన్నంగా ఉండబోతోంది" అంటూ క్యారీ-ఆన్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏకంగా 4.7 కోట్ల డాలర్లు (సుమారు రూ.396 కోట్లు)తో తెరకెక్కించడం విశేషం.
క్యారీ-ఆన్ మూవీ స్టోరీ ఏంటంటే?
యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్యారీ-ఆన్ ను భారీ బడ్జెట్ తో రూపొందించినా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే తీసుకొస్తున్నారు. జౌమే కొలెట్-సెరా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇందులో టారన్ ఎగర్టన్, సోఫియా కార్సన్, జేసన్ బేట్‌మ్యాన్ లాంటి వాళ్లు నటించారు.
ఈ సినిమా ఓ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) యువ అధికారి చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రమాదకర ప్యాకేజ్ ను విమానంలోకి అనుమతించే విధంగా ఆ అధికారిని బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఆ విమానం క్రిస్మస్ డే నాడే రావాల్సి ఉంటుంది. అతన్ని బ్లాక్ మెయిల్ చేసిన ఆ ప్రయాణికుడు ఎవరు? అలా ఎందుకు చేశాడు? ఆ ప్రమాదకర ప్యాకేజీలో ఏముంది? దీనివల్ల ఎలా ప్రమాదం రాబోతోంది అన్న విషయాలు ఈ క్యారీ-ఆన్ సినిమాలో చూడొచ్చు.
నిజానికి మూడున్నరేళ్ల కిందటే ఈ క్యారీ-ఆన్ సినిమా ప్రొడక్షన్ మొదలైంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైంది. సెప్టెంబర్ 2022 నుంచి జనవరి 2023 మధ్యలో షూటింగ్ పూర్తి చేశారు. అయితే రిలీజ్ కు మళ్లీ సుమారు రెండేళ్ల సమయం పట్టింది. మొత్తానికి డిసెంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.