OTT Action Thriller: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన మాస్ మహారాజా యాక్షన్ థ్రిల్లర్
OTT Action Thriller: మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్ ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
OTT Action Thriller: బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈగల్ ఇప్పుడు మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ లాంటి ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఆరు నెలల తర్వాత సన్ నెక్ట్స్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రావడం విశేషం.
ఈగల్ ఓటీటీ స్ట్రీమింగ్
భారీ అంచనాల మధ్య రిలీజైన రవితేజ మూవీ ఈగల్. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్నా.. నెల రోజులు ఆలస్యంగా వచ్చింది. అయితే అసలు అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. చాలా రోజుల కిందటే ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా తమ ప్లాట్‌ఫామ్ పై కూడా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చినట్లు సన్ నెక్ట్స్ ఓటీటీ తెలిపింది.
ఈగల్ కథేంటంటే?
ఈగల్ కథ చాలా చిన్నది. కేవలం రవితేజ క్యారెక్టర్‌ను నమ్మే రెండున్నర గంటలు నడిపించే ప్రయత్నంలో దర్శకుడు చాలా కంగాళీగా కలగపులగం చేసినట్లు అనిపిస్తుంది. చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. చేనేత వస్త్రాలు, ఆక్రమ ఆయుధాల వ్యాపారం రెండింటి మధ్య సింక్ కుదరనట్లుగా అనిపిస్తుంది. విక్రమ్, కేజీఎఫ్ స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లుగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ మొత్తం ఆ సినిమాలను గుర్తుకు తెస్తాయి.
సహదేవ వర్మగా రవితేజ స్టైలిష్‌గా కనిపించాడు. రవితేజ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌లో అతడి ఎనర్జీ మెప్పిస్తుంది. డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది. నళినీరావు అనే జర్నలిస్ట్‌గా అనుపమ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. రచనగా కావ్య థాపర్ సినిమాలో కనిపించేది తక్కువ టైమే. రవితేజతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. రవితేజ అసిస్టెంట్‌గా నవదీప్‌తోపాటు మధుబాల, శ్రీనివాస అవసరాల ప్రతి ఒక్క పాత్రను ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ రాసుకున్నాడు.
చేనేత రైతులకు సాయం, అక్రమ ఆయుధాల వ్యాపారం రెండు కంప్లీట్‌గా భిన్నమైన నేపథ్యాలు. వాటిని లింక్ చేస్తూ ఈగల్ కథను అల్లుకున్నారు డైరెక్టర్. హీరో పాత్ర, అతడి ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించి అనేక ప్రశ్నలతోఫస్ట్ హాఫ్‌ను ఎండ్ చేశాడు డైరెక్టర్.
సెకండాఫ్‌లో ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ వెళ్లాడు. సహదేవవర్మ, రచన ప్రేమాయణాన్ని అందంగా చూపించారు. కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఉన్న సహదేవవర్మ ఇండియాకు వచ్చిన ఆక్రమ ఆయుధాల వ్యాపారాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకున్నది ఎమోషనల్ సీన్‌తో కన్వీన్సింగ్‌గా ఆవిష్కరించారు.