Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం - పవన్ కళ్యాణ్ ఓజీపై మేకర్స్ ట్వీట్
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఓజీపై మేకర్స్ ఓ ప్రకటనను శనివారం రిలీజ్ చేశారు. 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని నిర్మాణ సంస్థ చెప్పింది. ఈ సినిమా కోసం ఇంకొన్ని రోజులు ఓపికగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చింది. ఓజీ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించి నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ సభల్లో ఓజీ అంటూ అరుస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరైంది కాదంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది.
నిరంతరం పనిచేస్తున్నాం...
"ఓజీ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓజీసినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు సమయం సందర్భం చూడకుండా ఓజీ ఓజీ అని అవరడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు.
వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరకీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025 ఓజీ పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం" అంటూ అభిమానులను ఉద్దేశించి డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్...
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఓజీ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తోన్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీ కావడం, ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఏంగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ మూవీ షూటింగ్ డిలే కావడంతో రిలీజ్ వాయిదాపడింది.
ఇమ్రాన్ హష్మీ విలన్...
ఓజీ మూవీలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తోన్నాడు. పవన్ మూవీతోనే అతడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ గ్యాంగ్‌స్టర్ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఓజీ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
మూడు సినిమాలు...
2025 వేసవిలో ఓజీ మూవీ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం ఓజీతో పాటు హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు చేస్తోన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కారణంగా ఈ సినిమాల షూటింగ్ ఆలస్యమవుతోంది. ఇటీవలే హరిహరవీరమల్లు షూటింగ్‌ను పూర్తిచేశారు పవన్ కళ్యాణ్. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతోంది.
టాపిక్