టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ
నటీనటులు: కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, వివేక్ నాయర్, ఐశ్వర్య రాజ్, విశాక్ నాయర్, మీనాక్షి అనూప్ తదితరులు
కథ: సాహి కబీర్
దర్శకత్వం: జీతూ అష్రాఫ్
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటింగ్: చమన్ చాకో
సినిమాటోగ్రఫీ: రాబీ వర్గీస్ రాజ్
నిర్మాతలు: మార్టిన్ ప్రక్కట్, రెంజిత్ నాయర్, సిబీ చవర
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: 20 మార్చి 2025
Officer On Duty Review Telugu: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మలయాళ సినీ ఇండస్ట్రీలో పాపులర్ యాక్టర్లలో కుంచకో బోబన్ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ. కుంచకో బోబన్‌కు ప్రియమణి భార్యగా నటించింది.
మలయాళంలో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ డైరెక్టర్ జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది. రీసెంట్‌గా తెలుగు థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు. ఇప్పుడు మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఆఫీసర్ ఆన్ డ్యూటీ రివ్యూలో తెలుసుకుందాం.
హరిశంకర్ (కుంచకో బోబన్) తన ప్రవర్తన కారణంగా డిప్యూటీ ఎస్పీ నుంచి సీఐగా డీమోట్ అవుతాడు. సీఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నకిలీ బంగారం తాకట్టు పెడుతున్నాడంటూ పోలీస్ స్టేషన్‌కు ఓ కేసు వస్తుంది. అది విచారించే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ సూసైడ్ కేసుకు లింక్ ఉందని తెలుస్తుంది. అందులో హరిశంకర్ కూతురు సూసైడ్ కేసుకు కూడా కనెక్ట్ అయి ఉందని తెలుస్తుంది.
గోల్డ్ చైన్‌లకు హరిశంకర్ పెద్ద కూతురు ఆత్మహత్యకు ఉన్న సంబంధం ఏంటీ? మిగతా వారి సూసైడ్‌లకు ఉన్న కనెక్షన్ ఏంటీ? అసలు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? వాటి వెనుక ఎవరున్నారు? వారిని హరిశంకర్ పట్టుకున్నారా? వాళ్లు ఎవరు? అనే థ్రిల్లింగ్ ట్విస్టులు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీని చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను మరో కొత్త కోణంలో పరిచయం చేసిన సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. తీగ లాగితే డొంకంత కదిలినట్లు, ఆ డొంకలో తన జీవితం కూడా ఉందని చెప్పే సీన్స్ నిజంగా ఊహించని విధంగా ఉంటాయి. సినిమా ప్రారంభమయ్యే ఓ పోలీస్ ఆఫీసర్ సూసైడ్ సీన్ నుంచి చివరి వరకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది.
స్క్రీన్ ప్లే, స్టోరీ, సీన్స్, డైలాగ్స్, ఎమోషన్స్ అన్నింటిని పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు రైటర్, డైరెక్టర్. ఒక చిన్న బంగారు చైన్‌తో మర్డర్ మిస్టరీలను సాల్వ్ చేసే క్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట నిజాయితీ గల, పొగరున్న ఆఫీసర్‌గా హరిశంకర్‌ను చూపించిన ఆ తర్వాత సినిమా కథను బట్టి తనలోని ఆవేదన, పడే పశ్చాత్తాపం పొగరును పక్కనపడేసేలా చేస్తాయి.
ఇన్వెస్టిగేషన్ సాగుతున్న కొద్దీ వచ్చే ఒక్కో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. యువత డ్రగ్స్ తీసుకోవడం, సెక్సువల్ అబ్యూస్, రివేంజ్, పోక్సో, శృంగార వీడియోలు వంటి అంశాలతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా వరకు గ్రిప్పింగ్ సీన్స్‌తో యాక్టర్స్ ఇంటెన్షన్ నటనతో సాగిపోతుంది. విలన్ గ్యాంగ్ చేసే పనులు, తప్పించుకునే తీరు కూడా కన్విన్సింగ్‌గా ఉంది.
కేవలం రెండు మూడు చోట్ల వచ్చే యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. ఇక బీజీఎమ్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. తెలుగులో డబ్ చేసిన పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా కుంచకోన్ బోబన్ ఇరగదీశాడు. బాధ, ఆవేశం, ఇన్వెస్టిగేషన్, ఇంటెన్సిటీ అన్నిటిన సమపాళ్లలో రంగరించి జీవించేశాడు.
OTT Movie Officer On Duty Review: భార్యగా, తల్లిగా ప్రియమణి ఆకట్టుకుంది. విలన్ గ్యాంగ్ యాక్టింగ్ కూడా డీసెంట్‌గా ఉంది. సైకో పనులు, చేసే యాక్షన్ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు చాలా న్యాయం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఊహించని ట్విస్టులు, మలుపులు, థ్రిల్లింగ్ సీన్లతో సాగే పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.
సంబంధిత కథనం