Odela 2 Review: ఓదెల 2 రివ్యూ.. తమన్నా తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకుందా?-odela 2 movie review in telugu and rating tamanna telugu horror film impress with visuals bgm odela 2 explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Odela 2 Review: ఓదెల 2 రివ్యూ.. తమన్నా తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకుందా?

Odela 2 Review: ఓదెల 2 రివ్యూ.. తమన్నా తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకుందా?

Sanjiv Kumar HT Telugu

Odela 2 Movie Review In Telugu And Rating: తమన్నా నటించిన తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ఇవాళ (ఏప్రిల్ 17) థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓదెల 2 రివ్యూలో తెలుసుకుందాం.

ఓదెల 2 రివ్యూ.. తమన్నా తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఆకట్టుకుందా?

టైటిల్: ఓదెల 2

నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, దయానంద్ రెడ్డి, నాగ మహేశ్, గగన విహారి, పూజా రెడ్డి తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సంపత్ నంది

దర్శకత్వం: అశోక్ తేజ

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్

నిర్మాత: డి మధు

విడుదల తేది: ఏప్రిల్ 17, 2025

Odela 2 Movie Review In Telugu And Rating: చాలా గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ తమన్నా చేసిన స్ట్రయిట్ తెలుగు మూవీ ఓదెల 2. ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చి సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిందే ఓదెల 2.

మైథలాజికల్, హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అయితే, ఇవాళ (ఏప్రిల్ 17) థియేటర్లలో ఓదెల 2 మూవీ విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఓదెల 2 రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఓదెల రైల్వే స్టేషన్ క్లైమాక్స్ నుంచి ఓదెల 2 కథ ప్రారంభం అవుతుంది. భర్త తిరుపతి )వశిష్ట ఎన్ సింహా)ని రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతుంది. దాంతో రాధ జైలుపాలవుతుంది. ఎంతోమంది యువతులని శోభనం రాత్రి రేప్ చేసి చంపిన తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష వేస్తారు ఓదెల గ్రామ ప్రజలు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది.

మరోవైపు పెళ్లయిన ఆడవాళ్లను ఫస్ట్ నైట్ రోజు రేప్‌కు గురై చనిపోవడం మళ్లీ మొదలవుతుంది. దీనికి కారణం తిరుపతి ప్రేతాత్మ అని అల్లా భక్షు (మురళీ శర్మ) చెబుతాడు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మను బంధించడానికి నాగ సాధువు భైరవి (తమన్నా) ఓదెల గ్రామానికి వస్తుంది.

ట్విస్టులు

మరి తిరుపతి ప్రేతాత్మ బారి నుంచి భైరవి ఓదెలను కాపాడిందా? తిరుపతి ఆత్మను బంధించే క్రమంలో భైరవికి ఎదురైన సమస్యలు ఏంటీ? అసలు భైరవి ఓదెలకు రావడానికి అసలు కారణం ఏంటీ? ఆడవాళ్లను తిరుపతి ప్రేతాత్మ ఎలా చంపింది? జైలులో ఉన్న రాధకు ఏమైంది? వంటి విశేషాలు తెలియాలంటే ఓదెల 2 మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఓదెల 2 స్టోరీ, ఎలా ఉండనుందనేది మూవీ ప్రమోషన్స్ ద్వారానే స్పష్టంగా తెలిసిపోయింది. పెళ్లయిన ఆడవాళ్లను పాశవికంగా అనుభవించే ఓ సైకో చచ్చి ప్రేతాత్మగా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో ఓదెల 2ను తెరకెక్కించారు. భార్య చేత చంపబడిన తిరుపతి ఎలా ప్రేతాత్మగా మారాడు, ఆ తర్వాత ఎలాంటి దారుణాలు చేశాడు, దాని వల్ల ఊరి ప్రజలు పడిన ఇబ్బందులతో సినిమా ఫస్టాఫ్ సాగుతుంది.

అయితే, ఇదంతా ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ ఎలా జరుగుతున్నాయని అనే క్యూరియాసిటీ నెలకొంది. అయితే, కథను చెప్పడానికే డైరెక్టర్ ఫస్టాఫ్ వాడుకున్నట్లుగా అర్థం అవుతోంది. నాగ సాధువుగా తమన్నా ఎంట్రీతో సినిమాలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తాయి.

ప్రేతాత్మతో పోరాడే సీన్స్

తిరుపతి ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కానీ, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎంగేజింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో కథ రక్తికట్టించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ పక్కన పెడితే తమన్నా ఎంట్రీ, విజువల్స్, ఇంటర్వెల్ బ్లాక్, బీజీఎమ్, సెకండాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆసక్తిగా ఉంటాయి.

అయితే, సినిమాలో కాస్తా ఎక్కువగానే రక్తపాతం, భయంకర సన్నివేశాలు ఉన్నాయి. రా అండ్ రస్టిక్‌గా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఆకట్టుకుంటుంది. బీజీఎమ్ బాగుంది. ఇక తమన్నా అన్నీ తానై సినిమాను ఒంటిచేత్తో నడిపించింది.

కొత్త తమన్నాను

ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్‌లో తమన్నాను చూసిన ఆడియెన్స్‌కు ఓదెల 2లో కొత్త తమన్నా కనిపిస్తుంది. యాక్టింగ్, ఎక్స్‌ప్రెషషన్స్‌తో అలరించింది తమన్నా. ఇక ప్రేతాత్మగా వశిష్ట ఎన్ సింహా చాలా బాగా ఆకట్టుకున్నాడు. తమన్నాతో పోటీ పడి యాక్ట్ చేశాడు. హెబ్బా పటేల్, మిగతా పాత్రలంతా పరిధి మేర ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే, భయపెట్టించే తమన్నా హారర్ థ్రిల్లర్ ఓదెల 2ను ఓసారి కచ్చితంగా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం