NTR Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్
Jr NTR - Prashanth Neel - NTRNEEL Update: జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‍లో రానున్న సినిమాపై అప్‍డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నేడు మేకర్స్ ఈ అప్‍డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందంటే..
NTRNeel Movie Update: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‍లో ‘వార్ 2’ మూవీ కూడా చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ లాంటి హైవోల్టేజ్ యాక్షన్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‍తో ఎన్టీఆర్ ఓ మూవీ (NTRNeel) చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఖరారైంది. అయితే, నేడు (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు కావటంతో ఈ చిత్రం గురించి అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్. షూటింగ్ ప్రారంభం ఎప్పుడో తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
షూటింగ్ ప్రారంభం ఆనెలలోనే..
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుంచి దీనిపై చాలా క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ షూటింగ్ విషయాన్ని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో ఎన్టీఆర్, నీల్ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించింది.
ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు.. జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేడు ఓ పోస్టర్ రిలీజ్ చేశాయి. #NTRNEEL సినిమా షూటింగ్ 2024 ఆగస్టులో ప్రారంభం అవుతుందని పేర్కొన్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‍ను టీమ్ ఖరారు చేసిందని తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి. అయితే, ఈ పోస్టర్‌లో టైటిల్ మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. #NTRNEEL అనే ప్రాజెక్ట్ పేరుతో పోస్టర్ తీసుకొచ్చారు.
ఆగస్టులోగా సలార్ 2 సినిమా షూటింగ్‍ను కంప్లీట్ చేసేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో మూవీకి ముందే ఆ సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలని నీల్ భావిస్తున్నారు. తన ఇమిడియెట్ ప్రాజెక్ట్ సలార్ 2 అని ప్రశాంత్ నీల్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టులో ఎన్టీఆర్‌తో సినిమా షూరూ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆలోగా ఎన్టీఆర్ కూడా దేవర, వార్ 2 మూవీలను కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
దేవర నుంచి సాంగ్, నయా పోస్టర్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి తొలి పాట వచ్చేసింది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందు ఆదివారమే (మే 19) ఈ ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది. సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అలాగే, ఈ మూవీ నుంచి నేడు ఓ కొత్త పోస్టర్ కూడా టీమ్ రిలీజ్ చేసింది. సముద్రపు ఒడ్డున పిల్లలతో ఎన్టీఆర్ ముచ్చటిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. మాస్ లుక్‍తో తారక్ అదరగొట్టారు.
దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో దేవర పాన్ ఇండియా రేంజ్‍లో భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది.