Simhadri Re Release Collections : ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ సంచలనం.. ఆ టాప్ 5 లిస్టులో..
NTR Simhadri Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా సింహాద్రి. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజై సెన్సేషన్ సృష్టిస్తోంది. నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్(Re Release) ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి మళ్లీ విడుదల చేస్తున్నారు. కాస్త అప్ గ్రేడ్ చేసి.. క్వాలిటీతో తీసుకొస్తున్నారు. హీరోల బర్త్ డేలు, స్పెషల్ రోజుల్లో వీటిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్యాన్స్ సైతం.. తమ హీరోను పాత సినిమాలో మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. 4కే వెర్షన్ లో అప్ డేట్ చేసి.. థియేటర్లలో వదులుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న సూపర్ డూపర్ హిట్ మూవీ సింహాద్రిని రీ రిలీజ్ చేశారు.
ఈ చిత్రం మళ్లీ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.6 లక్షల గ్రాస్ వసూలు చేసి, రీ-రిలీజ్‌లో టాప్ 5 గ్రాసర్‌గా నిలిచింది. సింహాద్రి రీ రిలీజ్‌తో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. సింగమలై అంటూ ఆ సమయంలో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేవి. ఇప్పుడు మరోసారి అభిమానులు ఊగిపోతున్నారు. ఈ చిత్రం వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. టాలీవుడ్‌లో రీ రిలీజ్ అయిన టాప్ 5 గ్రాసర్స్ ఇలా ఉన్నాయి.
దేశముదురు - 33 లక్షలు
ఖుషీ - 29 లక్షలు
జల్సా - 26.4 లక్షలు
సింహాద్రి - 25.6 లక్షలు
పోకిరి - 24.9 లక్షలు
ఈ మూవీ భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదల అయింది. బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అదిరిపోయే కలెక్షన్లు కూడా తీసుకొచ్చింది. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన సినిమాలో భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించారు. నాజర్ ముఖ్యమైన పాత్రలో ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. కీరవాణి(Keeravani) సంగీతం అందిచాడు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ 4కే వెర్షన్ లో థియేటర్లకు వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.